భారత్ కు స్విట్జర్లాండ్‌ వినూత్న సంఘీభావం  

కరోనా మహమ్మారిపై భారత పోరాటానికి స్విట్జర్లాండ్‌ వినూత్నంగా సంఘీభావం ప్రకటించింది. దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో..మ్యాటర్‌హార్న్‌ శిఖరంపై మువ్వన్నెల జెండాను ప్రదర్శించింది. 

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో భారతీయులకు గెలిచే విశ్వాసం, సామర్థ్యం కలగాలని కోరుకుంటూ ట్వీట్ చేసింది. స్విట్జర్లాండ్‌కు చెందిన విద్యుద్దీపాల కళాకారుడు.. గెరీ హాఫ్‌సెట్టర్‌.. స్విట్జర్లాండ్‌, ఇటలీ దేశాల మధ్య ఉన్న ఈ ఆల్ఫ్స్‌ పర్వత శ్రేణుల్లో.. దాదాపు 4,478 మీటర్ల ఎత్తున్నశిఖరంపై లేజర్‌ లైట్లతో పలు దేశాల జెండాలను ప్రదర్శించారు. 

ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనిపించని కరోనా మహమ్మారితో చేస్తున్న పోరాటంలో గెలవాలని.. ఈ లైటింగ్‌ సిరీస్‌ను స్టార్ట్‌ చేశారు. చిమ్మని చీకట్లో మిణుకు మిణుకు చుక్కల్లో ఆ పెద్ద పర్వతంపై.. మిళమిళ మెరిసిన మన మువ్వన్నెల జెండా చూపరులను ఆకట్టుకుం తున్నది.

ఇలా ఉండగా, కరోనా కారణంగా ప్రపంచమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ క్లిష్ట సమయంలో ఒకరినొకరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ తెలిపారు. ఒకరినొకరు ఆదుకుంటున్న దేశాలకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. 

కరోనా నివారణకు మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనిచేస్తుందని పలువురు పేర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల భారత్‌ దీనిని అమెరికాతో సహా పలు దేశాలకు అందజేసింది. ఇంకా కొన్ని దేశాలకు ఈ ఔషధాన్ని పంపనున్నది. ఈ నేపథ్యంలో గుటేరస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలువాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే సాయం చేయగల స్థితిలో ఉన్నారో వాళ్లు తప్పక సాయం చేయాలి. ఇప్పటికే ఇలాంటి సాయం చేస్తున్న భారత్‌, ఇతర దేశాలకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని గుటేరస్‌ పేర్కొన్నారు.