తెలంగాణ కాంగ్రెస్ వర్గాలను రాహుల్ కలుపుతారా !

కాంగ్రెస్ అద్యక్షుడి హోదాలో రాహుల్ గాంధీ మొదటిసారిగా రెండు రోజుల తెలంగాణ పర్యటనకు సోమవారం మధ్యాన్నం హైదరాబాద్ కు చేరుకొంతున్నారు. వచ్చే సంవత్సరం జరిగే సాధారణ ఎన్నికలకు పార్టీని సిద్దం చేయడం కోసం ప్రధానంగా వస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టి ఆర్ ఎస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎడుర్కొంతున్నదని, దానితో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావడం ఖాయం అన్నట్లు కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో కనిపిస్తున్నారు.

 

అయితే తన నీడను చూసి తానే భయపడుతున్న కెసిఆర్ ప్రభుత్వంకు  యేవో సాకులు చూపి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు జరుపుకొనే రాజకీయ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడం పరిపాటిగా మారింది. అదే తరహాలో రాహుల్ గాంధీ పర్యటనకు సహితం ఆంక్షలు విధించడం ద్వారా ప్రభుత్వం అనవసరపు ప్రాముఖ్యత కల్పించిన్నట్లు కనిపిస్తున్నది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచినా ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరు చెబితేనే వణికి పోతున్న కెసిఆర్ అక్కడకు ఎవ్వరు వెళ్ళినా ఆందోళన చెందుతున్నారు. అందుకనే రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేయాలనీ కాంగ్రెస్ నాయకులు భావించినా కుదరదని పోలీస్ లతో చెప్పించారు.

 

అట్లాగే విమానాశ్రయం నుండి ఊరేగింపు జరుపుకోవడం కుడా కుదరదన్నారు. దానితో రాహుల్ గాంధీ పాల్గొనే కార్యక్రమాలను సహితం కుదించిన్నల్టు కనిపిస్తున్నది. ప్రధానంగా కెసిఆర్ పాలన పట్ల అసమ్మతితో ఉన్న వర్గాలను దగ్గరకు చేర్చుకోవడంతో పాటు, ఎవ్వరికీ వారుగా ఉన్న కాంగ్రెస్ నాయకులతో `ఐక్యత ప్రదర్శన’ చేయించడం కోసం రాహుల్ పర్యటన ఉద్దేశించిన్నట్లు కనిపిస్తున్నది.

 

రాహుల్ గాంధీ ఏ రాష్ట్రంకు వెళ్ళిన అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివిధ వర్గాల నాయకులతో చేతులు కలిపించి, వారిని ఐక్యంగా చూపించి ఇక పార్టీ ఇకమత్యంతో ఉన్నదనే సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఒకొక్క జిల్లలో రెండు, మూడు గ్రూప్ లు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన రేవంత్ రెడ్డి, నాగం జనార్ధనరెడ్డి వంటి నేతల ఉనికి పార్టీలోని సీనియర్ నాయకులకు గిట్టడం లేదు. డి శ్రీనివాస్ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నా ఇక్కడ నాయకులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు.

 

నాలుగేళ్ళుగా పార్టీలో ఐక్యత కోసం చెప్పుకోదగిన కృషి చేయలేక్ అపోయిన ప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డినే కొనసాగిస్తున్నారు. ఎస్ జయపాల్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు, డి కే అరుణ వంటి నేతలని ఒకదారికి తీసుకు రావడం ఆయనకు సాధ్యపడటం లేదు. ప్రతిపక్ష నేత కే జానారెడ్డి తీరే పార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు. ఇటువంటి పరిస్థితులలో పార్టీని ఒకటిగా నడిపించడం రాహుల్ కు సాధ్యమా అనే ప్రశంలు తలెత్తుతున్నాయి. సీట్లు ఇస్తామంటే అధికార పార్టీలో చేరడానికి పలువురు నాయకులు సిద్దంగా ఉన్నారని అందరికి తెలిసిందే.