కూలిపోతున్న చైనా ఆర్ధిక వ్యవస్థ 

ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బకు ఆ దేశ జీడీపీ ఐదు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.  చైనా వృద్ధిరేటు దారుణంగా పడిపోయింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ చతికిలపడింది. 

ఫలితంగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.8 శాతం క్షీణించింది. 1976 తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. అప్పట్లో వచ్చిన సాంస్కృతిక విప్లవం తర్వాత వృద్ధి రేటు భారీగా క్షీణించింది. మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో పడిపోయింది.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో వృద్ధిరేటు 6.8 శాతం కుంచించుకుపోయిందని అధికారిక నివేదిక వెల్లడించింది. 1979లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారని నిపుణలు తెలిపారు.  

చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ 20.65 ట్రిలియన్ యువాన్లు అంటే.. దాదాపు 2.91 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇది 6.8 శాతం తక్కువ.  2018లో 13.1 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న చైనా జీడీపీ 2019లో 14.38 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. 

వైరస్‌ అదుపులోకి వచ్చిన నెల రోజుల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని అంచనావేసిన ఆర్థిక వేత్తలు తమ అంచనాలను వెనక్కితీసుకున్నారు. వ్యాపార,రిటైల్‌, ఇతర విక్రయాలు ప్రతికూలానికి పడిపోయాయి. 

చైనా ఆర్థికంలో 80 శాతం వాటా కలిగిన  రిటైల్‌ ఖర్చులు 19 శాతానికి పడిపోవడం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపాయి. చైనా ఎకానమీ 1992 తర్వాత ఇంత భారీగా దిగజారడం ఇదే మొదటిసారి. 

దేశ ఆర్థిక పరిస్థితిపై శుక్రవారం ప్రెసిడెంట్ జీ జిన్ పింగ్ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. వీలైనంత మేరకు లిక్విడిటీని అందుబాటులో ఉంచడం, రిజర్వ్ బ్యాంకు ఉంచుకునే నిల్వలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు మీడియా వెల్లడించింది.