ఉనికి కోసం కాంగ్రెస్ విఫల యత్నాలు 

కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం మొత్తం భారత దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రశంసనీయమైన కృషి చేస్తుంటే, రాజకీయంగా తమ ఉనికి కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ అధిష్టానం విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. 

ఐటీవల చరిత్రలో బహుశా మొదటి సారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి ఉమ్మడిగా ఈ విషయమై కృషి చేస్తున్నాయి. రాజకీయాల ప్రమేయం లేకుండా సహకారంతో కృషి చేస్తున్నారు. రాజకీయంగా ప్రధాని మోదీని నిశితంగా విమర్శిస్తుండే మమతా బెనర్జీ, పునరాయి విజయన్ వంటి నేతలు సహితం రాజకీయ అంశాలను పక్కన బెట్టి కేంద్రంతో కలసి పని చేస్తున్నారు. 

చివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు సహితం కేంద్రంతో అవగాహనతో పని చేస్తున్నాయి. దానితో తమ ఉనికికి ముప్పు ఏర్పడినదనే భావనతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధాని తీసుకున్న లాక్ డౌన్, ప్రధాని గరీబ్ యోజన వంటి వాటిని ప్రశంసిస్తూనే ఇంకేదో చేయడం లేదంటూ రెండు లేఖలను ప్రధాని మోదీకి సంధించారు. 

అయితే ఆ లేఖలను ఎవ్వరు పట్టించుకొనక పోవడం, చివరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకొనక పోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఖంగుతిన్నది. అప్పుడు రాహుల్ గాంధీ రంగప్రవేశం చేసి మొదటిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరోనా టెస్టులు తగినన్ని చేయడం లేదని లోపాలు కనుగొనే ప్రయత్నం చేశారు.

రాహుల్ మాటలను సహితం సొంత పార్టీవారే పట్టించుకోటం లేదు. సుమారు రెండు నెలల తర్వాత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చైర్మన్‌గా  సోనియా గాంధీ ఓ సంప్రదింపుల కమిటీని ప్రకటించారు. 

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో పాటు ముఖ్యమైన విషయాలపై పార్టీ వైఖరిని రూపొందించడానికి ఈ బృందం ప్రతిరోజూ కలుస్తుందని ప్రకటించారు. ఈ బృందంలో ఉన్నవారంతా తరచూ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా తమ రాజకీయ ఉనికికి ప్రయత్నం చేస్తుండేవారే కావడం గమనార్హం.