దేశంలో క‌రోనా మ‌ర‌ణాల రేటు 3.3 శాత‌మే

దేశంలో క‌రోనా వైర‌స్‌తో సంభ‌విస్తున్న మ‌ర‌ణాల రేటు 3.3 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.  70శాతానికి పైగా మరణాలు 70ఏళ్లు పైబడిన వారే అని వెల్లడించారు.   

వ‌య‌సుల వారిగా మ‌ర‌ణాల రేటును ఆయ‌న తెలిపారు.  0-45 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 14.4 శాతం, 45-60 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 10.3 శాతం, 60-75 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 33.1 శాతం, 75 ఏళ్ల‌కు పైబ‌డిన వారు 42.2 శాతం మ‌ర‌ణిస్తున్నార‌ని అగ‌ర్వాల్ చెప్పారు. 

వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు 83 శాతం ఉన్న‌ట్లు తెలిపారు. దేశ‌వ్యాప్తంగా 1992 మంది వైర‌స్ చికిత్స పొంది కోలుకున్నార‌ని పేర్కొన్నారు.  కోలుకున్న వారి సంఖ్య 13.85 శాతంగా ఉంద‌ని చెబుతూ గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 991 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని చెప్పారు. దీంతో మొత్తం సంఖ్య 14,378కి చేరుకున్నద‌ని, దేశ‌వ్యాప్తంగా మ‌ర‌ణాల సంఖ్య 480కి చేరింద‌ని వివరించారు.  

23 రాష్ట్రాల్లో ఉన్న 47 జిల్లాల్లో పాజిటివ్ ట్రెండ్ ఉన్న‌ట్లు అగ‌ర్వాల్ తెలిపారు. పుదుచ‌రిలోని మాహే, క‌ర్నాట‌క‌లోని కొడ‌గు జిల్లాల్లో గ‌త 28 రోజుల్లో ఎటువంటి పాజిటివ్ కేసు న‌మోదు కాలేద‌ని పేర్కొన్నారు. మ‌రో 45 జిల్లాల్లో గ‌త 14 రోజుల్లో కొత్త కేసు న‌మోదు కాలేద‌ని చెప్పారు. మొత్తం 14,378 కేసుల్లో.. మర్క‌జ్‌కు సంబంధించి 4291 కేసులు ఉన్న‌ట్లు అగ‌ర్వాల్ తెలిపారు.  

మ‌ర్క‌జ్‌తో లింకున్న కేసులు 23 రాష్ట్రాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు చెప్పారు. త‌మిళ‌నాడులో 84 శాతం, ఢిల్లీలో 63 శాతం, తెలంగాణ‌లో 79 శాతం, యూపీలో 59 శాతం, ఏపీలో 61 శాతం కేసుల‌న్నీ మ‌ర్క‌జ్‌తో లింకున్న‌వే అని వివరించారు.