భారత్ మందులు పంపుతుంటే, పాక్ ఉగ్రవాదుల ఎగుమతి 

భారత్ ఒక వైపు కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, పలు దేశాలకు మందులను ఎగుమతి చేయడంలో భారత్ తీరికలేకుండా ఉంటే, పాకిస్థాన్ మాత్రం సరిహద్దులలో కాల్పులు జరుపుతూ, ఉగ్రవాదులను మనదేశంలోకి పంపించడంలో తీరికలేకుండా ఉన్నదని భారత సైన్యాధిపతి జనరల్ ఎమ్ఎమ్ నరవనే ఎద్దేవా చేశారు. 

కాల్పుల విరమణను పాకిస్తాన్ తరచూ ఉల్లంఘిస్తుందని దుయ్యబట్టారు. భారత్ ‌తో సహా… ప్రపంచదేశాలు కరోనాను ఎదుర్కొంటుంటే పాకిస్తాన్ మాత్రం భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించడంలో బిజీగా ఉందని మండిపడ్డారు. సరిహద్దు ప్రాంతంలో పరిస్థితులను పర్యవేక్షించడానికి నరవనే ప్రస్తుతం కశ్మీర్ లో పర్యటిస్తున్నారు.

దేశంలోకి చొరబడడానికి ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులను భద్రతాదళాలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ సమర్థమంతమైన దేశమని… ఒకవైపు ప్రపంచదేశాలకు కరోనాను ఎదుర్కోవడానికి మందులు పంపిస్తూనే, మరో వైపు దేశంలో కరోనా విజృంబించకుండా సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 

ఎప్రిల్ 5న కేరన్ సెక్టార్ నుంచి కాశ్మీర్ లోయకు ఉగ్రవాదులు చొరబడడానికి ప్రయత్నించారని భద్రతాదళాలు వారిని ఎదుర్కోగా… ఆ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులవగా, ఐదుగురు ఉగ్రవాదులు మృతిచెందారని తెలిపారు. కాల్పుల విరమణను ఉల్లంగించినందుకు బార్డర్లోని పాకిస్తాన్ కు చెందిన ఆర్మీ పోస్టులను, టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను  ద్వంసం చేసినట్లు వెల్లడించారు. 

భారత్ సహా ఇతర ప్రపంచ దేశాలు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పోరాటం చేస్తుంటే పొరుగు దేశం మాత్రం మనల్ని ప్రమాదంలో పడేయాలని చూడటం అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు.  ఇక భారత సైన్యంలో ఇప్పటి వరకు ఎనిమిది మందికి కరోనా సోకగా.. ఒకరు పూర్తిగా కోలుకుని విధుల్లో చేరారని నరవాణే వెల్లడించారు.