వ్యవసాయోత్పత్తుల రవాణాకు ‘కిసాన్‌ రథ్‌’ యాప్ 

వ్యవసాయోత్పత్తుల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌పోర్ట్‌ అగ్రిగేటర్‌ మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘కిసాన్‌ రథ్‌’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ యాప్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఆవిష్కరించారు. 

వ్యవసాయ క్షేత్రాల నుంచి ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు 5 లక్షల ట్రక్కులు, 20 వేల ట్రాక్టర్లు ఈ మొబైల్‌ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘లాక్‌డౌన్‌ సమయంలో రైతుల తమ ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రక్కులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 

వ్యవసాయ ఉత్పత్తులను మండీలు, ఇతర మార్కెట్లకు తరలించడానికి కిసాన్‌ రథ్‌ యాప్‌ ఉపయోగపడుతుంద’ని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. రైతుల ఇబ్బందులను తొలగించడానికి కొద్దిరోజుల క్రితం ఇండియా అగ్రి ట్రాన్స్‌పోర్ట్‌ కాల్‌ సెంటర్‌ను మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దేశంలో రాష్ట్రాల మధ్య పండ్లు, కూరగాయలు, ఆహార ధాన్యాలు ఇతర వ్యవసాయోత్పత్తుల రవాణా సులభతరం చేయడానికి కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్టు హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. 14488 నంబర్‌లోగానీ, 18001804200 నంబర్‌లో గానీ కాల్‌ సెంటర్‌ను సంప్రదించవచ్చన్నారు.