రాష్ట్రాలకు వెసులుబాటు కలిగించిన ఆర్బీఐ 

వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ) కింద రాష్ట్రాలకు కల్పించే ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని 60 శాతానికి పెంచుతున్నట్టు రిజర్వు బ్యాంకు శుక్రవారం ప్రకటించడంతో కరోనాతో తీవ్రమైన ఆర్ధిక వత్తిడులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కలిగించినట్లు అయింది. 

ఇది ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. రాబడులు, చెల్లింపుల మధ్య తాత్కాలిక తేడాలు ఎదురైనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొంటాయి. ఇలా తీసుకొనే స్వల్పకాలిక రుణాలనే వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌గా వ్యవహరిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అడ్వాన్సులను పొందేందుకు రిజర్వు బ్యాంకు చట్టంలోని సెక్షన్‌ 17(5) వీలు కల్పిస్తుంది. 

ఇది రుణవనరు కాదు. తాత్కాలిక ఓవర్‌డ్రాఫ్ట్‌ మాత్రమే. ఇలాంటి అడ్వాన్సుల గరిష్ఠ కాలపరిమితి కేంద్ర ప్రభుత్వానికి 10 రోజులు, రాష్ట్ర ప్రభుత్వాలకు 14 రోజులు ఉంటుంది. ఈ అడ్వాన్సులపై రిజర్వు బ్యాంకు రెపోరేటుతో సమానంగా వడ్డీ వసూలు చేస్తుంది. ఆర్బీఐ నిర్ణయించిన పరిమితికి లోబడి ఈ అడ్వాన్సులు తీసుకొనేందుకు వీలుంటుంది. 

ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఆర్బీఐ ప్రభుత్వంతో సంప్రదించి ఈ పరిమితిని నిర్ణయిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వానికి ఈ పరిమితి రూ.1.20 లక్షల కోట్లుగా ఉన్నది. గతేడాది ఇది రూ.75 వేల కోట్లుగా ఉన్నది.  

మరోవంక, నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) లేదా మొండి బకాయిల గుర్తింపు నిబంధనలను ఆర్బీఐ సడలించింది. ప్రస్తుతం రుణగ్రహీతలు 90 రోజుల్లో తమ రుణాలను తిరిగి చెల్లించకపోతే వాటిని బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటిస్తున్నాయి. ఈ గడువును ఆర్బీఐ ఇప్పుడు 180 రోజులకు పొడిగించింది. 

ఈ నిర్ణయంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొన్నవారు ప్రయోజనం పొందనున్నారు. ఎన్‌పీఎలలో పెరుగుదల ఉండదు గనుక బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మరిన్ని రుణాలు పొందేందేందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్పొరేట్లు ఆసక్తిచూపే అవకాశం ఉంటుంది. 

ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి రిజర్వు బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయాలు చిన్న స్థాయి పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, నిరుపేదలు, రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతాయని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు.  అలాగే బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ద్రవ్య  లభ్యతతోపాటు రుణ వితరణ సామర్థ్యం పెరుగుతుందని త్లెఇపారు. డబ్ల్యూఎంఏ పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలు కూడా ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు.   

రిజర్వుబ్యాంక్‌ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో నిధుల ప్రవాహం పెరుగడంతోపాటు సులభంగా రుణాలు లభించనున్నాయని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నెలలోపే సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించిన రెండో ఉద్దీపన ప్యాకేజీతో మొండి బకాయిల మార్గదర్శకాలు మరింత సులభతరం, డివిడెండ్‌ చెల్లింపులపై నిషేధం విధించడం, రివర్స్‌ రెపోరేటును పావు శాతం తగ్గించడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనున్నదని భరోసా వ్యక్తం చేశారు.