లాక్‌డౌన్‌తో సగం తగ్గిన కరోనా వైరస్ 

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో లాక్‌డౌన్‌ సత్ఫలితాలనిస్తున్నది. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. లాక్‌డౌన్‌కు ముందు మూడ్రోజుల్లోనే కేసులు రెట్టింపు అయ్యేవని, కానీ ప్రస్తుతం సగటున 6.2 రోజులు పడుతున్నదని తెలిపింది. 

19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ రెట్టింపు శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నదని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారు, మరణిస్తున్నవారి నిష్పత్తి 80:20గా ఉన్నదని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే మనం మెరుగ్గా ఉన్నామని చెప్పారు.

కేసుల సగటు వృద్ధిరేటు మార్చి 15-31 మధ్య 2.1శాతంగా ఉండగా, ఏప్రిల్‌ 1 నుంచి అది 1.2శాతానికి తగ్గినట్లు వివరించారు. టెస్ట్‌లను పెంచడం వల్లే ఈ 40 శాతం తగ్గుదల నమోదైందని చెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్19కోసం ప్రత్యేకించిన ఆస్పత్రుల్లో 1.73 లక్షల ఐసొలేషన్ బెడ్లు, 21,800 ఐసియు బెడ్లు అందుబాటులో ఉన్నాయని లవ్ అగర్వాల్ చెప్పారు.  

ఇప్పటివరకు 3,19,400 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, గురువారం ఒక్క రోజే 28,300 పరీక్షలు నిర్వహించామని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) శాస్త్రవేత్త గంగా ఖేడ్కర్ చెప్పారు.  

ఇలా ఉండగా, ఒక క్వారంటైన్ జోన్‌నుంచి నాలుగు వారాల పాటు కొత్తగా సెకండరీ కోవిడ్19 కేసు లేకపోతే, చివరగా వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినఅందరినీ 28 రోజుల పాటు జాగ్రత్తగా గమనించిన తర్వాత ఆ ప్రాంతంలో వైరస్ కట్టడి కార్యకలాపాల స్థాయిని (కంటైన్మెంట్ ఆపరేషన్స్)తగ్గించవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

కంటైన్మెంట్ ఆపరేషన్ అంటే ఆ ప్రాంతంలో చివరి కేసు పరీక్షలో నెగెటివ్‌గా వచ్చిన రోజునుంచి 28 రోజులుగా పరిగణించాలని తాజా వివరణలో తెలియజేసింది.