వుహాన్‌ నగరంలో 50 శాతం పెరిగిన మరణాలు 

కరోనా వ్యాప్తికి సంబంధించిన వాస్తవాలను ప్రపంచం ముందుంచకుండా చైనా వంచన చేసిన్నట్లు వ్యక్తమవుతున్న ఆగ్రవేశాలకు తాజాగా మరో ఉదాహరణ లభించింది.  కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్యలో, దీని వల్ల మరణించిన వారి సంఖ్యలో చైనా భారీగా మార్పులు చేసింది. 

మృతుల లెక్కను వుహాన్​లో 50 శాతం, దేశం మొత్తంలో 30 శాతం పెంచింది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,632కు, కేసుల సంఖ్య 82,692కు పెరిగింది. ప్రధానంగా వైరస్‌కు కేంద్రబిందువైన వుహాన్‌ నగరంలో మరణాలను దాదాపు 50 శాతం పెంచి చూపింది. 

 దీంతో కరోనా విషయంలో తొలి నుంచి చైనాను విమర్శిస్తున్న అమెరికా మరోసారి ధ్వజమెత్తింది. అమెరికాకుతోడు బ్రిటన్‌ కూడా గొంతు కలిపింది. కరోనా వైరస్‌ వల్ల వుహాన్‌లో 2,579 మంది మరణించారని, 50,008 మంది ఈవ్యాధి బారి న పడ్డారని ఇటీవల చైనా ప్రకటించింది. అయితే ఈ గణాంకాలను శుక్రవారం సవరించింది. 

వుహాన్‌లో కరోనా వల్ల మొత్తం 3,869 మంది మరణించారని తెలిపింది. తాజాగా 1,290 మరణాల వివరాలు వెలుగులోకి వచ్చాయని, దీంతో ఈ సంఖ్య 3,869కి చేరిందని పేర్కొంది అలాగే వైరస్‌ సోకినట్లు తాజాగా 325 మంది వివరాలు వెల్లడయ్యాయని, దీంతో ఈ సంఖ్య 50,333కు చేరిందని వివరించింది. 

ఈ వివరాలు సవరించడానికి గల కారణాలను కూడా ప్రస్తావించింది. వుహాన్‌లో వైరస్‌ విజృంభించడంతో చాలా మంది ఇండ్లల్లోనే చికిత్సపొందుతూ మరణించారని తెలిపింది. ఈ వివరాలు సకాలంలో అందకపోవడంతో తాము కూడా అప్పట్లో అందుబాటులో ఉన్న వివరాలనే ప్రకటించామని తెలిపింది. 

కానీ ఈ వివరాలు ఇప్పుడు ప్రభుత్వానికి చేరడంతో మార్పులు చేశామని వివరించింది. కాగా కరోనా కేసుల వివరాలను చైనా దాచిపెడుతున్నదని పలుసార్లు అమెరికా విమర్శించిన విషయం తెలిసిందే.