కొత్త కిట్ తో జగన్ కు కరోనా టెస్ట్ 

దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను దిగుమతి చేసుకోగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ కిట్లను తన కార్యాలయం నుంచి ప్రారంభించారు. 

ఈ నేపథ్యంలో, వైద్యులు సీఎం జగన్ కు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ను ఉపయోగించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ వచ్చింది. ప్రత్యేకంగా చార్టర్‌ విమానంలో దక్షిణ కొరియాలోని సియోల్‌ నుంచి ర్యాపిడ్‌ టెస్టు కిట్లను తెప్పించారు. 

ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలన్నది ప్రభుత్వ యోచన. తద్వారా కరోనా వ్యాప్తిని త్వరితగతంగా అరికట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది.  

ర్యాపిడ్‌ కిట్లలో ఐజీజీ, ఐజీఎం రెండురకాలు స్ట్రిప్స్‌ ఉంటాయి. కేవలం బ్లడ్‌ డ్రాప్స్‌ను ఈ స్ట్రిప్స్‌పై వేస్తారు. తర్వాత కంట్రోల్‌ సొల్యూషన్‌ వేస్తారు. 10 నిమిషాల వ్యవధిలో వైరస్‌ ఉన్నదీ, లేనిదీ చూపిస్తుంది. 

దక్షిణ కొరియాకు చెందిన ఎస్‌డీ బయోసెన్సార్‌ కంపెనీ వీటిని ఉత్పత్తి చేస్తోంది. అమెరికా, ఐరోపా లాంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.  ఐసీఎంఆర్‌ ఇప్పటికే ఈ కిట్లకు ఆమోదం తెలిపింది. 

ఇలా ఉండగా, శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 38 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 572కి చేరింది. కర్నూలు జిల్లాలో మరో 13మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ జిల్లాలో మొత్తం కేసులు 126కు పెరిగాయి.