ట్రంప్‌ మూడంచెల ప్రణాళిక

కరోనా మహమ్మారితో కుదేలైన అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మూడంచెల ప్రణాళికను ఆవిష్కరించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలను మూడు విడుతలుగా సడలించాలని ప్రతిపాదించారు. ఆ అధికారాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లకే అప్పగించారు. 

గత వారం మరో 52 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆ దేశ కార్మిక విభాగం ప్రకటించిన రోజే ట్రంప్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. కరోనా కారణంగా అమెరికాలో ఒక్క మార్చి నెలలోనే 2.2 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. కాగా కరోనా వల్ల గత 24 గంటల్లో 4,591 మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలోనే ఒక్కరోజులో ఇవే అత్యధిక మరణాలు. 

తొలి విడుత: కరోనా నిర్ధారిత కేసులు, వైరస్‌ లక్షణాలున్న వారి సంఖ్య వరుసగా 14 రోజులపాటు తగ్గుముఖం పడితే ‘స్టే ఎట్‌ హోం’ (ఇంటికే పరిమితం కావడం) ఆంక్షలను ఎత్తివేయవచ్చు. 

రెండో విడుత: వైరస్‌ ముప్పు అధికంగా ఉన్నవారిని ఇండ్లకే పరిమితం చేయాలి. ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రోత్సహించాలి. కామన్‌ ప్రదేశాలను మూసే ఉంచాలి. ఉద్యోగుల సాధారణ ప్రయాణాలకు అనుమతించవచ్చు. సామూహిక వేదికలను తెరువవచ్చు. కానీ నిర్ణీత దూరం పాటించడం తప్పనిసరి. 

మూడో విడుత: సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాలున్న దృష్ట్యా వ్యక్తిగత పరిశుభ్రత, నిర్ణీత దూరం తప్పక పాటించాలి. 

ఇలా ఉండగా, అమెరికా లో కరోనా కట్టడి కోసం ఏర్పాటుచేసిన వైట్‌హౌస్‌ కరోనా వైరస్‌ సలహా మండలిలో డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ, భారతసంతతికి చెందిన ఆర్వో ఖన్నాకు చోటుదక్కింది. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల నుంచి నియమితులైన ఏకైక భారతసంతతి వ్యక్తి ఖన్నానే. 

కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది ప్రాణా కోల్పోయారు. వారిలో సగంమంది ఐరోపా వారే.  అన్ని దేశాల్లో 5,72,076 మంది బాధితులు ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,50,683కు చేరింది.

అత్యధికంగా యూఎస్‌లో 37,158 మంది కరోనా బారిన పడి చనిపోయారు. స్పెయిన్‌లో 20,002, ఇటలీలో 22,745, ఫ్రాన్స్‌లో 18,681, జర్మనీలో 4,352, యూకేలో 14,576, చైనాలో 4,632, ఇరాన్‌లో 4,958, టర్కీలో 1,769, బెల్జియంలో 5,163, బ్రెజిల్‌లో 2,171, కెనడాలో 1,310, నెదర్లాండ్స్‌లో 3,459, స్విట్జర్లాండ్‌లో 1,327 మంది ప్రాణాలు కోల్పోయారు.