పుష్కలంగా అందుబాటులోకి నగదు : ఆర్‌బీఐ 

కరోనా కారణంగా చిన్నాభిన్నమై ఆర్ధిక వ్యవస్థను దారిలోకి తీసుకు రావడంకోసం రిజర్వు బ్యాంకు పలు చర్యలను ప్రకటించింది. ముఖ్యంగా ఆర్ధిక వ్యవస్థలో ఎక్కువగా నగదు లభించేటట్లు చేయడం కోసం బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలకు రూ 50,000 కోట్లు ప్రకటించింది. అదే విధంగా నిరర్ధక ఆస్తుల నిబంధనలను సడలించింది. 

రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూంఏ పెంపుదల చేసిన్నట్లు రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్‌దాస్‌ ప్రకటించారు. ఇది సెప్టెంబర్‌ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ కు సంబంధించిన ప్రతీ అంశాన్ని పరిశిలీస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా  అధిగమించేందుకు ఆర్‌బీఐ  అండగా వుంటుందని ఆయన  భరోసా ఇచ్చారు.  కరోనా ప్రభావం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

బ్యాంకులు ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు కృషిచేయాలని కోరారు.  ఇందులో భాగంగా సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50 వేల కోట్లు, జాతీయ హౌసింగ్‌ బోర్డుకు రూ.10వేల కోట్లు, నాబార్డుకు రూ. 25వేల కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. 

రెపో రేటు యథాతథంగా కొనసాగుతుందని, రివర్స్‌ రెపోరేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నామని చెప్పారు. దీంతో రివర్స్‌ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిందని వెల్లడించారు. మారటోరియం సయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదని చెప్పారు.  

ఏప్రిల్‌లో ఆహార ఉత్పత్తుల ధరలు 2.3 శాతం పెరిగాయని చెప్పారు. కాగా, ఆర్‌బీఐ చర్యలతో బ్యాంకుల్లో సరిపడా ద్రవ్యలభ్యత ఉన్నదని  శక్తికాంత్‌ దాస్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశామని, జీడీపీలో 3.2 శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. 

2020-21 ఏడాదికి భారత్‌ వృద్ధిరేటు 1.9 శాతం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసిందని వెల్లడించారు. 20201-22 ఏడాదికి భారత్‌ వృద్ధిరేటు 7.4 శాతం ఉంటుందని అంచనావేస్తున్నామని పేర్కొన్నారు. జీ 20 దేశాల్లో భారతదేశ వృద్ధిరేటు ఎక్కువగా ఉందని తెలిపారు. 

కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదొడుకులు ఎందుర్కొంటున్నాయని, లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను క్షుణంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా చ్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.