గ్లోబల్ ఎక్స్ పోర్ట్ హబ్ గా భారత్!

కరోనా దెబ్బతో గ్లోబల్‌‌గా తయారీ రంగం ఎక్కడికక్కడ ఆగిపోవడంతో, కరోనా,  ట్రేడ్‌‌ వార్‌‌‌‌తో  తీవ్రంగా దెబ్బతింటున్న కంపెనీలు తమ సప్లయ్‌‌ చెయిన్ డెస్టినేషన్లను చైనా  నుంచి  మార్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. భవిష్యత్‌‌లో సప్లయ్‌‌ చెయిన్‌‌ అంతరాయం కలగకుండా ఉండేందుకు కొత్త డెస్టినేషన్లను వెతుకుతున్నాయి. ఈ కంపెనీలను ఆకర్షించేందుకు మోడీ ప్రభుత్వం తగిన  వ్యూహాన్ని  సిద్ధం చేస్తోంది. 

భారత దేశంలోని ఫార్మా, ఆటోమొబైల్‌‌ వంటి రంగాలు చైనాపై ఎక్కువగా ఆధారపడకుండా, స్థానికంగానే  సప్లయ్‌‌చెయిన్‌‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తోంది. గ్లోబల్‌‌గా  చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ఆపిల్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌ పార్టనర్‌‌‌‌ విస్ట్రన్‌‌ కార్ఫ్‌‌  ప్రొడక్షన్‌‌  కెపాసిటిని చైనాలో తగ్గించుకోవాలనుకుంటోంది.  

ఏడాది లోపు చైనా నుంచి సగానికి పైగా తయారీని మార్చుకొంటామని ఈ సంస్థ ప్రకటించింది. దీంతో పాటు ఇతర ఆపిల్‌‌ పార్టనర్లు హొన్‌‌హై ప్రెసిషన్‌‌, ఇన్వెంటక్‌‌ కార్ప్​, పెగట్రన్‌‌ కార్ప్‌‌ వంటి కంపెనీలు కూడా తమ సప్లయ్‌‌ చెయిన్‌‌ను చైనా నుంచి ఇతర దేశాలకు మార్చడానికి సిద్ధమవుతున్నాయి.

కరోనా దెబ్బకు అమెరికాతో సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు నష్టపోతున్న విషయం తెలిసిందే. తమ సప్లయ్‌‌ చెయిన్‌‌లను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసుకోవడంపై ఇక ఈ దేశాలు దృష్టిపెడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ కంపెనీలను చైనా నుంచి మార్చడం కోసం జపాన్‌‌ ఇప్పటికే 2.2 బిలియన్‌‌ డాలర్ల భారీ ప్యాకేజిని ప్రకటించింది. 

ప్రస్తుత పరిస్థితులలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్  మంచి స్థాయిలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిని అందిపుచ్చుకునేందుకు అనేక చర్యలను మొదలు పెట్టిందని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌‌ మాన్యుఫ్యాక్చరర్లను ఆకర్షించేందుకు అనేక చర్యలను తీసుకొంది. 

దేశంలో మొబైల్‌‌ ఫోన్‌‌ మాన్యుఫ్యాక్చరింగ్‌‌కు ఊతం  ఇచ్చేందుకు గత నెలలో  మూడు స్కీమ్‌‌లను తెచ్చింది. ఈ స్కీమ్‌‌ల ద్వారా సుమారు రూ. 48,000 కోట్ల విలువైన  ప్రొత్సాహకాలను ప్రకటించింది.  ఇందులో ముఖ్యమైనది ప్రొడక్షన్‌‌ లింక్డ్‌‌ ఇన్సెంటివ్‌‌ పీఎల్‌‌ఐ) స్కీమ్‌‌. ఆపిల్‌‌, శామ్‌‌సంగ్‌‌, ఒప్పో వంటి పెద్ద కంపెనీలు తమ వాల్యు చెయిన్‌‌లను ఇండియాలో ఏర్పాటు చేసి, భారత్ ను ఎక్స్‌‌పోర్ట్‌‌ హబ్‌‌గా మార్చేందుకు ఈ స్కీమ్‌‌లు ఉపయోగపడతాయని  ప్రభుత్వం అంచనా వేస్తోంది.