అమెరికాను దిక్కరిస్తూ ఇరాన్ నుండి రూపాయితోనే చమురు కొనుగోలు

ఒక వంక అమెరికా ఆంక్షలను దిక్కరిస్తూ రష్యా నుండి అత్యాధునిక క్షీపణి వ్యవస్థ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, మరోవంక అమెరికా అంక్షలను దిక్కరిస్తూ ఇరాన్ నుండి డాలర్ తో సంబంధం లేకుండా రూపాయితో చమురు కొనుగోలుకు సిద్దపడుతున్నారు. తమ దేశ అవసరాలే తమకు ముఖ్యం అంటూ అమెరిక అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఢీకొనేందుకు సిద్దపడుతున్నారు.

ఇరాన్‌పై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించినా సరే భారత ప్రభుత్వ చమురు సంస్థలు అక్కడి నుంచి 1.25 మిలియన్‌ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. డాలర్ల స్థానంలో రూపాయల్లో చెల్లింపులు చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దానితో ఇప్పటికే డాలర్ తో రూపాయి విలువ పడిపోతూ ఉండడంతో తీవ్ర ఆర్ధిక వత్తిడులను ఎదుర్కొంటున్న భారత్ కు పెద్ద ఉపశమనం కలిగిన్నట్లు కానున్నది.

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్‌‌ (ఎంఆర్‌పీఎల్‌) నవంబర్‌ నెలలో ఇరాన్‌ నుంచి 1.25 మిలియన్ టన్నుల చమురు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తున్నది. అమెరికా విధించిన ఆంక్షలు నవంబర్‌ నుంచే అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఆంక్షలు అమలైనా ఐవోసీ ఎప్పుడూ ఎంత పరిమాణంలో ఇరానియన్‌ చమురు కొనుగోలు చేస్తుందో ఇప్పుడూ అంతే చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2018-19 ఆర్థిక ఏడాదికి 9 మిలియన్‌ టన్నులు అంటే నెలకు 0.75 టన్నులు కొనుగోలు చేస్తుందన్నమాట.

అమెరికా ఆంక్షల ప్రకారం నవంబర్‌ 4 నుంచి ఇరాన్‌కు డాలర్లలో చెల్లింపులు చేసే మార్గాలు మూసుకుపోతాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను భారత్‌కు రూపాయల్లోనే సరకు అమ్ముతుంది. ఆ రూపాయలను తిరిగి భారత్‌లోనే ఔషధాలు, వస్తువులు కొనుగోలు చేసేందుకు వెచ్చించనుంది. ఈ తరహా ప్రణాళిక సిద్ధం అవుతోందని ఉన్నత వర్గాల నుంచి తెలిసింది. మరికొన్ని రోజుల్లో ఇది అమల్లోకి రానుంది. భారత సంస్థల తరఫున యూకో బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు ఇరాన్‌కు చెల్లింపులు చేయనున్నాయి.

భారత్‌ 2017-18 ఏడాదికి ఇరాన్‌ నుంచి 25 మిలియన్‌ టన్నుల క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి చేయాలనుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, నయారా ఎనర్జీ (గతంలో ఎస్సార్‌ ఆయిల్‌) ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌ నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోవడంతో దిగుమతుల పరిమాణం 22.6 మిలియన్‌ టన్నులకు రానుంది. ప్రస్తుతం ఐరోపా బ్యాంకుల ద్వారా ఇరాన్‌కు భారత్‌ చెల్లింపులు చేస్తోంది. ఈ నెల నుంచి ఈ మార్గాలు ఆగిపోతాయి. అందుకనే రూపాయి తో చెల్లింపులు జరపనున్నారు.