కరోనా కట్టడిలో బెంగళూరు ముందంజ 

కరోనా వైరస్ ను కట్టడిలో ప్రపంచంలోని ప్రధాన నగరాలు అన్నింటిలో బహుశా బెంగళూరు ముందంజలో ఉన్నట్లు పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి. గురువారం నాటికి ముగ్గురు మృతి చెందడంతో పాటు 76 మందికి మాత్రమే పాజిటివ్ నమోదయింది. 

రెండు లక్షలకు పైగా కేసులతో న్యూయార్క్ నగరం కరోనా కేసులలో ప్రపంచంలోనే ముందంజలో ఉండగా, సుమారు 68 వేల కేసులతో  చైనాలోని  ఉహాన్ నగరం రెండో స్థానంలో ఉంది. స్పెయిన్ లోని మాడ్రిడ్ నగరం 48 వేల కేసులతో ఆ తర్వాతి వరసలో ఉంది. మన దేశంలో కూడా 1,756 కేసులతో ముంబై, 1516 కేసులతో ఢిల్లీ 214 కేసులతో చెన్నై లలో కూడా ఈ వైరస్ ఉధృతంగా వ్యాపించింది. 

ఈ వైరస్ విస్తృతంగా వ్యాపించిన ప్రపంచంలోని మిగిలిన నగరాలతో పోల్చుకొంటే బెంగళూరులో పరిమిత స్థాయిలోనే ఉన్నట్లు వెల్లడి అవుతుంది. ఒక రోజులో గరిష్టంగా ఈ నగరంలో 8 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. 

అయితే 10 లక్షల మందికి 184 చొప్పున కర్ణాటకలో వైరస్ టెస్టింగ్ ల శాతం కూడా చాల తక్కువగా ఉంది. జాతీయ సగటు 192గా ఉంది. వైరస్ సోకినా వారిలో సగం మంది వరకు బెంగుళూరులో  కోలుకోవడం గమనార్హం. 

వారిలో అత్యధికులు   20 నుండి 29 ఏళ్ళ మధ్య వయసు గల యువకులు కావడంతో తొందరగా కోలుకొంటున్నట్లు భావిస్తున్నారు. కేవలం 11 మంది మాత్రమే 60 ఏళ్లకు పైబడిన వారున్నారు. 

వైరస్ సోకినా వారిలో 48 శాతం మందికి విదేశీ ప్రయాణం చేసినవారుండగా, తబ్లీఘి జమాత్ సదస్సుకు వెళ్లివచ్చిన వారు 14 శాతం మంది మాత్రమే ఉన్నారు. పాజిటివ్ సోకిన వారి ద్వారా 25 శాతం మందికి సోకింది.