ఐపిఎల్ నిరవధిక వాయిదా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధికారికంగా ప్రకటించింది. కరోనా వల్ల దేశంలో అల్లకల్లోల వాతావరణం నెలకొందని ఇలాంటి స్థితిలోఇప్పట్లో ఐపిఎల్ నిర్వహించడం సాధ్యం కాదని బిసిసిఐ స్పష్టం చేసింది. 

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూడక తప్పదని ఫ్రాంచైజీ యాజమాన్యాలకు వివరించింది. ప్రస్తుత వాతావరణంలో ఐపిఎల్ వంటి మెగా టోర్నీని నిర్వహించడం దాదాపు అసాధ్యంగా మారిందని తెలిపింది. తమకు టోర్నీక కంటే క్రికెటర్లు, అభిమానులు, సహాయక సిబ్బంది ఆరోగ్యమే ముఖ్యమని, దీంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చామని బిసిసిఐ ప్రధాన కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఇక, టోర్నీని పూర్తిగా రద్దు చేయాలా లేకుంటే మిని టోర్నమెంట్ నిర్వహించాలా అనే దానిపై ఇప్పట్లో ఏమీ చెప్పలేమని జైషా స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయని, ఇలాంటి స్థితిలో ఐపిఎల్‌ను నిర్వహించడం కుదిరేపని కాదన్నారు. పరిస్థితులు కుదుట పడే వరకు వేచిచూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక, తన దృష్టిలో మాత్రం ఈ సీజన్‌లో ఐపిఎల్ జరగడం కష్టమేనని స్పష్టం చేశారు. 

రెండు మూడు నెలల్లో పరిస్థితులు కాస్త అనుకూలంగామారితే టోర్నీ నిర్వహణ గురించి ఆలోచిస్తామని తెలిపారు. అప్పటి వరకు ఫ్రాంచైజీలు కానీ, బిసిసిఐ కానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయదని తేల్చి చెప్పారు. ఇక, ఐపిఎల్ వాయిదా వేయడం బిసిసిఐతో పాటు క్రికెటర్లకు, ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్లకు నష్ట దాయకమేనని జైషా పేర్కొన్నారు. అయితే క్రికెట్ కోసం ప్రజలు, క్రికెటర్ల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టలేమన్నాడు. 

ఇదిలావుండగా ఐపిఎల్‌తో పాటు దేశవాళి క్రికెట్ టోర్నీలను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు జైషా తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘా లు క్రికెట్ టోర్నీల నిర్వహణపై ఎటువంటి ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేశారు. కాగా, ట్వంటీ20 ప్రపంచకప్ నిర్వహణ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై పూర్తి అధికారం ఐసిసికి మాత్రమే ఉందని జైషా వివరించారు.