దేశంలో 325 జిల్లాల్లో కరోనా లేదు

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 325 జిల్లాల్లో క‌రోనా కేసులు ఒక్క‌టి కూడా లేవ‌ని  కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ  ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. అలాగే గ‌త 28 రోజుల‌గా పుదుచ్చేరిలోని మ‌హె జిల్లాలో కొత్త‌గా కేసులు రాలేద‌ని తెలిపారు.  మ‌రో 27 జిల్లాల్లో గ‌డిచిన 14 రోజులుగా క‌రోనా కేసులు న‌మోదు కాలేద‌ని చెబుతూ దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు  సంకేతం ఇచ్చారు. 

 కాగా, దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ)తో క‌లిసి కొత్త కార్యాచరణ ప్రణాలికను సిద్ధం చేసిన‌ట్లు   ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. గ‌తంలో భార‌త్ లో పోలియో కంట్రోల్ కోసం స‌హ‌క‌రించిన డ‌బ్ల్యూహెచ్ఓ స‌ర్వైలెన్స్ టీమ్స్ ను ప్ర‌స్తుత అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకోనున్న‌ట్లు చెప్పారు. 

దేశంలో క‌రోనా కంటైన్మెంట్ జోన్ల‌లో వైరస్ వ్యాప్తి క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌పై నిన్న డ‌బ్ల్యూహెచ్ఓ ఫీల్డ్ ఆఫీస‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన‌ట్లు చెప్పారు.

ఇలా  ఉండగా,దేశంలో ఇటీవ‌ల రోజూ వెయ్యికి పైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌గా గురువారం ఆ సంఖ్య కొంచెం త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 826 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు ఇవాళ సాయంత్రం ఐదు గంట‌ల బులెటెన్ లో వెల్ల‌డించింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. అలాగే నిన్న సాయంత్రం ఐదు గంట‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 28 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది. 

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 12,759కి చేరిన‌ట్లు చెప్పింది. అందులో 420 మంది మ‌ర‌ణించ‌గా.. 1515 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని వెల్ల‌డించింది. ఇక 10,824 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రాల వారీగా చూస్తే మ‌హారాష్ట్ర‌లో దేశంలోనే అత్య‌ధికంగా 2,919 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఢిల్లీలో 1578, త‌మిళ‌నాడులో 1248, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో 1120, రాజ‌స్థాన్ లో 1023 మందికి క‌రోనా సోకింది. గుజ‌రాత్ లో 871, యూపీలో 773, తెలంగాణలో 698, ఏపీలో 534, కేర‌ళలో 388, క‌ర్ణాట‌కలో 315 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

మరోవంక,  దేశంలో క‌రోనా టెస్టింగ్ సామర్ధ్యం భారీగా పెరిగింద‌ని భార‌త మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) తెలిపింది. బుధ‌వారం ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా 30,043 టెస్టులు చేసిన‌ట్లు చెప్పింది. ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో ఉన్న 176 వైరాల‌జీ ల్యాబ్స్ లో 26,331 మందికి, 78 ప్రైవేటు ల్యాబ్స్ లో 3,712 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం ఒక్క షిష్టులో ప‌ని చేస్తేనే రోజుకు 42,400 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గ‌ల‌మ‌ని, అదే రెండు షిఫ్టుల్లో ప‌ని చేస్తే 78,200 టెస్టులు చేయ‌వ‌చ్చని తెలిపింది. దేశంలో దాదాపు మూడు ల‌క్ష‌ల టెస్టులు పూర్తి చేసిన‌ట్లు చెప్పింది ఐసీఎంఆర్. ఇప్ప‌టి వ‌ర‌కు 2,90,401 మందికి క‌రోనా టెస్టులు చేసిన‌ట్లు వెల్లడించింది.