లాక్ అవుట్ సమయంలో విద్యార్థులకో క్యాలండర్ 

దేశవ్యాప్తంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం సమయంలో విద్యార్థులు సరదాగా చదువుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ఓ కేలండర్‌ను రూపొందించింది. ఎన్‌సీఈఆర్‌టీ సహకారంతో అభివృద్ధి చేసిన దీనిని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ విడుదల చేశారు. 

మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో ఎన్‌సీఈఆర్‌టీ ఈ ఆల్టర్నేటివ్ అకడమిక్ కేలండర్‌ను రూపొందించిందని రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. 

విద్యా బోధన సరదాగా, ఆసక్తికరంగా ఉండేవిధంగా సామాజిక మాధ్యమాలు, టెక్నలాజికల్ టూల్స్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో ఉపాధ్యాయులకు తెలిపే  మార్గదర్శకాలను ఈ కేలండర్‌లో పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు. 

విద్యార్థులు తమ ఇళ్లలోనే ఉంటూ,  సరదాగా చదువుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్ఎంఎస్. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 

మనలో చాలా మందికి ఇప్పటికీ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సదుపాయం లేదని చెప్తూ, తల్లిదండ్రులు, విద్యార్థులకు ఎస్ఎంఎస్ లేదా మొబైల్ ఫోన్ కాల్ ద్వారా మార్గదర్శనం చేయాలని ఉపాధ్యాయులకు ఈ కేలండర్ చెప్తోందని చెప్పారు. ఈ కేలండర్‌ను అమలు చేయడంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి తల్లిదండ్రులు సహాయపడాలని సూచించారు. 

ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అన్ని సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకుని ఈ కేలండర్‌ను రూపొందించినట్లు తెలిపారు. దివ్యాంగులైన బాలలు కూడా చదువుకోవడానికి వీలుగా దీనిని రూపొందించినట్లు చెప్పారు. ఆడియో బుక్స్, రేడియో ప్రోగ్రామ్స్, వీడియో ప్రోగ్రామ్స్ కూడా దీనిలో ఉన్నట్లు తెలిపారు. 

కళలు, శారీరక వ్యాయామాలు, యోగాభ్యాసం వంటివాటిని కూడా దీనిలో చేర్చినట్లు తెలిపారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూలలో దీనిని రూపొందించినట్లు చెప్పారు. 

ఈ కేలండర్‌ను డీటీహెచ్ చానళ్ళ ద్వారా ప్రసారం చేస్తామని మంత్రి ప్రకటించారు.  అదేవిధంగా ఎస్‌సీఈఆర్‌టీలు, డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సీబీఎస్ఈ, స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహిస్తామని తెలిపారు.