మత ప్రాతిపదికన రోగుల విభజనా... భారత్ ఖండన 

మత ప్రాతిపదికన కరోనా రోగులను వేరుచేసి ఉంచుతున్నారని అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా కమిషన్ (యూఎస్ సీఐఆర్ఎఫ్) చేసిన విమర్శలను భారత్ తీవ్రంగా ఖండించింది. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కరోనా రోగులను వారి మతాలను బట్టి వేరువేరు గదుల్లో ఉంచున్నారని వచ్చిన ఓ 'తప్పుడువార్తను' బట్టి యూఎస్ సీఐఆర్ఎఫ్ ఆ విమర్శలు చేసిందని పేర్కొన్నది. 

ఒక సర్కారీ ఆస్పత్రిలో ఇలాంటి మతపరమైన విభజన జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయని యూఎస్ సీఐఆర్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తీవ్రంగా స్పందించారు. 

భారత్‌లో మతస్వేచ్ఛ గురించి ప్రవచనాలు చేయడమే కాకుండా ఇప్పుడు నియమబద్ధమైన వైద్యవృత్తిపై కూడా యూఎస్ సీఐఆర్ఎఫ్ విమర్శలు చేయడం ఏమీ బాగాలేదని ఆయన ఖండించారు. మతపరంగా రోగులను వేరుచేయడం లేదని గుజరాత్ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 

మహమ్మారిపై జరుగుతున్న జాతీయ పోరాటానికి మతపరమైన రంగులు అద్ది బృహత్తరమైన కృషి నుంచి దృష్టి మళ్లించరాదని శ్రీవాస్తవ యూఎస్ సీఐఆర్ఎఫ్‌కు హితవు చెప్పారు.