భద్రతా బలగాలపై ఉగ్రదాడులకు ఐఎస్ఐ వ్యూహం  

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత ఆపత్కాలంలో జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలపై ఉగ్రదాడులు చేసేందుకు పాక్ ఐఎస్ఐ రహస్య వ్యూహం రూపొందించింది. 

నిషేధిత టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిడా సహాయంతో పాకిస్థాన్ లోయలో ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’, తెహ్రీక్ -ఈ-మిలాట్ -ఈ-ఇస్లామీల పేరిట రెండు కొత్త ఉగ్రవాద సంస్థలను పాక్ ఐఎస్ఐ ఏర్పాటు చేసిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు రహస్య సమాచారం అందింది.

జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు చేసేందుకు వీలుగు అన్ని ఉగ్రవాద సంస్థలు ఏకం కావాలని కోరుతూ ది రెసిస్టెన్స్ ఫ్రంట్, తెహ్రీక్ -ఈ-మిలాట్ -ఈ-ఇస్లామీ ఉగ్రవాద సంస్థల కమాండర్ నయీమ్ ఫిర్దౌస్ పేరిట తాజాగా ఓ ఆడియో ప్రకటన విడుదల అయింది. 

ఈ ఆడియో సందేశం సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. రెసిస్టెన్స్ ఫ్రంట్ ను జేకే ఫైటర్స్ పేరిట కూడా పిలుస్తున్నారని భారత భద్రతా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి.

భారతదేశానికి వ్యతిరేకంగా జిహాద్ లో చేరాలని ప్రేరేపిస్తూ తెహ్రీక్-ఈ-మిలాట్-ఈ-ఇస్లామీ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబూఅనాస్ ఆడియో కూడా బయటపడింది. 

కశ్మీర్ లో దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని అందిన సమాచారం మేర భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. రాడార్ సాయంతో సరిహద్దుల్లో చొరబాటుదారులను గుర్తించి వారి ఆట కట్టించేందుకు జవాన్లు సమాయత్తమయ్యారు.