108 దేశాలతో భారత్ వైద్య దౌత్యం 

కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో వందకుపైగా దేశాలతో భారత్ వైద్య దౌత్యం నడుపుతోంది. కరోనా చికిత్స​లో కీలకంగా మారిన హైడ్రాక్సిక్లోరోక్విన్​ మెడిసిన్​ను రెండు వారాల నుంచి భారీగా ఇతర దేశాలకు పంపుతోంది. ఇప్పటి వరకూ 85 మిలియన్ల క్లోరోక్విన్​ ట్యాబ్లెట్లను, 500 మిలియన్ల పారిసిటమాల్​ ట్యాబ్లెట్లను 108 దేశాలకు పంపినట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

దీనికి అదనంగా ట్యాబ్లెట్ల తయారీలో ఉపయోగించే పారాసిటమాల్ గ్రాన్యూల్స్​ను వెయ్యి టన్నుల వరకూ ఎగుమతి చేశారు. ఇప్పటి వరకూ 60 దేశాలకు సంబంధించి 4 వేలకుపైగా ఆర్డర్లు వచ్చాయని, అవన్నీ రవాణాకు సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటికే కొన్ని చేరుకోవడం కూడా జరిగినదని వివరించారు. 

అన్ని దేశాలు విమాన సర్వీసులను నిలిపేయడంతో ఇతర దేశాలకు క్లోరోక్విన్​ ను ఎగుమతి చేయడం సమస్యగా మారింది. భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానాలలో ఈ మందులు, ఇతర వస్తువులను పంపతున్నారు. 

 ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉన్న డొమినిక్​ రిపబ్లిక్​ కు మన క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు పంపాలంటే యూఎస్​ ఎవాక్యుయేషన్​ ఫ్లైట్​లో అట్లాంటాకు, అక్కడి నుంచి న్యూయార్క్​కు,  చివరగా డొమినిక్​ రిపబ్లిక్​కు గురువారం చేరిందని చెప్పారు. ఇక మారిషస్, సీషెల్స్​కు క్లోరోక్విన్​ ట్యాబ్లెట్లను భారత్ బహుమతి​గా పంపిందని, ఐఏఎఫ్​ ప్లేన్లలో ఇవి బుధవారం వెళ్లాయని అన్నారు. ఇక ఆఫ్ఘానిస్థాన్​కు పంపాలంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిఉందని అధికార వర్గాలు వివరించారు.

5 మిలియన్ల క్లోరిక్విన్​ ట్యాబ్లెట్లను, భారీ మొత్తంలో పారాసిటమాల్​ ట్యాబ్లెట్లను 31 దేశాలకు కరోనా వ్యతిరేక పోరాటంలో భాగంగా గ్రాంట్​గా సరఫరా చేస్తున్నారు. వైరస్​ వల్ల తీవ్రంగా ప్రభావం పడిన మన మిత్ర దేశాలకు ముందుగా వీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.  

ప్రస్తుతం ప్రత్యేక ఆర్ధిక మండలిలలో లేదా ఎగుమతుల కోసం కేటాయించిన వంద శాతం డ్రగ్స్ ను ఇతర దేశాలకు సరఫరా చేయాలని భారత్ నిర్ణయించింది. అయితే ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదురైనా స్వదేశీ  అవసరాలకు సరిపడా డ్రగ్స్​ను ఉంచుకుని మిగతా వాటిని ఎగుమతి చేయాలని భావిస్తోంది. 

వాణిజ్య ఒప్పందాలలో భాగంగా ఇప్పటికే భారత్ అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, నెదర్లాండ్స్​ లతోసహా 24 దేశాలకు 80 మిలియన్ల క్లోరోక్విన్​ ట్యాబ్లెట్లను సరఫరా చేశారు. ఇటలీ, స్వీడన్, సింగపూర్​ సహా 52 దేశాలకు పెద్ద మొత్తం పారాసిటమాల్​ ట్యాబ్లెట్లను ఎగుమతి  చేయగా, మరికొన్ని దేశాలకు రెండు ట్యాబ్లెట్లనూ పంపారు.