కందుల రైతుల డబ్బు వెంటనే చెల్లించాలి 

కందులు కొనుగోలు చేసిన రైతుల ఖాతాల్లో డబ్బులు పడటంలేదని, తక్షణమే ఖాతాల్లో డబ్బులు పడేలా ఏర్పాట్లు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ డిమాండ్ చేశారు. ఆయ‌న రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై ఫోన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్ళారు. 

రైతులకు వరి ధాన్యం కొనుగోలు కోసం బస్తాలను త్వరగా అందించాలని, కాంటలు, లోడింగ్, ఆన్ లోడింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కొన్ని చోట్ల డ్రా విధానం, కొన్ని చోట్ల టోకెన్ విధానం ఉండటం వల్ల రైతులు గందరగోళంలో ఉన్నారని అంటూ ఒకే విధానాన్ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని స్పష్టం చేశారు. 

వరికి  రూ 1835 మద్దతు ధర ఇచ్చినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ధాన్యాన్ని రైతలు తక్కువ ధరకు అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులను ప్రభుత్వం పేద వారికి సబ్సిడీపై అందించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధానాల్లో రేషన్ సామగ్రి రాష్ట్రంలో అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. 

భవన నిర్మాణ కార్మికులను అదుకొని తగిన న్యాయం చేయాలని కోరారు.  ఇతర రాష్ట్రాల వలస కూలీలు, కార్మికులకు బియ్యం , పప్పు, డబ్బులు అందించాలని సంజయ్ సూచించారు. రేషన్ పంపిణిలో అధికారులకు పూర్తి స్థాయి వివరాలు అందించక పోవడంతో గందరగోళం నెలకొందని చెబుతూ దానికి ఒకే రేషన్ పాలసీని ప్రకటించాలని కోరారు. 

లాక్ డౌన్ కాలంలో అత్యవసర సేవల కోసం ఫీల్డ్ అసిస్టెంట్స్ ను విధుల్లోకి తీసుకోవాలని,  ఇతర రాష్ట్రాల నుండి కాలినడకన వచ్చే వారిపై పోలీసులు కఠినంగా కాకుండా కనికరం చూపించాలని సంజయ్ కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ వద్ద పోలీస్ ఆఫీసర్ వలస కార్మికులను అడివిలో వదిలి రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు.