చికిత్స లేకుండానే కరోనా నుండి కోలుకొంటున్న 80 శాతం 

నేడు ప్రపంచంలో కరోనా మహమ్మారితో లక్షలాది మంది తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నా వారిలో 80 శాతం మంది వరకు ఎటువంటి చికిత్స అవసరం లేకుండానే కోలుకొంటున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ వైరస్ కు ఇప్పటి వరకు తగు టీకాలు గాని, మందులు గాని లేకపోవడంతో వైద్యులు రక, రకాల ప్రయోగాలు చేస్తున్నారు. 

ఎటువంటి చికిత్స అందించాలో తెలియక వైద్యులు తికమకపడుతున్నారు. అయినా, కరోనా రోగులలో తీవ్రత ఎక్కువగా ఉన్న వారు మినహా మిగతా వారంతా ఏ  విధమైన చికిత్స లేకుండానే కోలుకొంటున్నట్లు వెల్లడించింది.  కరోనా  ప్రభావం ప్రారంభమైన నాటికి నుంచి డబ్ల్యూహెచ్ఒ ట్విట్టర్ ద్వారా దాదాపు 60 లక్షల మంది కరోనా పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. 

వీటిలో ఎక్కువగా అడిగిన 14 ప్రశ్నలు సమాధానాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా లక్షణాలను అందులో వివరించింది. ఏ వయసు వారికైనా కరోనా సోకుతుందని…వేడి వాతావారణంలో కరోనా వైరస్ బతకదన్నది నిజం కాదని స్పష్టం చేసింది. 

ఆస్తమా, షుగర్, హుద్రోగం ఉన్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. మాస్క్ ఉన్న సోషల్ డిస్టెన్స్ కనీసం మీటర్ దూరం పాటించాలని కోరింది. వ్యాక్సిన్ ఎప్పుడూ వస్తుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ దీనికి పలు ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నామని,  వ్యాక్సిన్ వచ్చేందుకు మరింత సమయం పడుతుందని డబ్ల్యూహెచ్ఒ తెలిపింది.