తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ అరెస్ట్  

నాటకీయ పరిణామాల మధ్య తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ను ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ కార్యక్రమాన్ని లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా నిర్వహించిన కేసు నమోదైన విషయం విదితమే. ఇతనితో పాటు మరో ఆరుగురు పైనా కేసులు నమోదు చేశారు. 

ఆ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్చి 28 నుంచి మౌలానా సాద్ స్వీయ క్వారంటైన్‌లో ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించనట్లు సమాచారం. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు కారకులనే ఆరోపణలు ఉన్నాయి.

కరోనా కారణంగా సాంఘిక దూరం పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను ఎగతాళి చేస్తూ మరణం అల్లా అనుమతితో జరుగుతుంది. అల్లా ఆపాలనుకుంటే మనం చచ్చిపోతామా? అల్లా చంపాలనుకుంటే వీళ్లు బతికిస్తారా? అంటూ ఆడియో టేపులు కూడా సాద్ విడుదల చేశాడు. 

తాను కూడా కరోనా బాధితుడినేనని, సెల్ఫ్ క్వారంటైన్ ఉన్నానని మౌలానా ప్రకటించుకున్నాడు. ఇతని కోసం పోలీసులు ఢిల్లీలోని తజీమ్ ఘర్ ప్రాంతంలోనూ, ఆ చుట్టుపక్కల గాలిస్తున్న క్రమంలో సాద్ స్వీయ క్వారంటైన్ పూర్తికావడంతో పోలీసులకు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారకులయ్యారంటూ జమాతేపై కూడా ఐపిసి 304 ప్రకారం హత్యకేసు నమోదు చేశారు. ఇప్పటికే మౌలానా సాద్ సెల్ఫ్ క్వారంటైన్ సమయం పూర్తికావడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ సాద్‌కు పోలీసులు రెండు నోటీసులు పంపారు. 

మరోవంక, ఢిల్లీ నిజాముద్దీన్ లో తబ్లిగి జమాత్ కార్యక్రమానికి హాజరు కావడం కోసం విదేశాల నుంచి నిధులు సమకూర్చిన 1890 డిపాజిటర్లపై క్రైమ్ బ్రాంచి లుకవుట్ నోటీసు జారీ చేసింది. వీరంతా వీసా నిబంధనలు ఉల్లంఘించి మత కార్యక్రమాల్లో నిమగ్నమైనట్టు నమ్ముతున్నారు. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించడానికి మర్కజ్‌తో సన్నిహిత సంబంధం ఉన్న 18 మందికి క్రైమ్ బ్రాంచి నోటీసులు జారీ చేసింది. 

ఇంతకు ముందు క్రైమ్ బ్రాంచి బృందం మర్కజ్‌కు పాల్గొనడానికి ఎవరు వచ్చారో వారిలో 1500 మందిని పట్టుకుంది. వీరిలో 400 మంది విదేశీయులు ఉన్నారు. వీరంతా ఢిల్లీ లోని వివిధ ప్రాంతాల్లో పెద్ద మసీదుల్లో, బంధువుల ఇళ్లలో ఉన్నారు.