కరోనాతో సకాలంలో సాధారణ వర్షాలు 

కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు తీవ్రమైన ప్రతికూలతలు ఎదుర్కొంటున్నా వర్షాలు మాత్రం సకాలంలో, సాధారణంగా రాగలవని భాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తున్నది.  కరోనాతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు ఊపిరిపోస్తాయనే ఆశలు కలిగిస్తున్నాయి. దేశంలో ఏటా కురిసే వర్షాల్లో 75 శాతం ఈ నాలుగు నెలల్లోనే పడుతాయి. 

వానకాలం సీజన్‌ అంచనాలను ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం మహాపాత్ర వెల్లడిస్తూ ఈ సీజన్‌లో సాధారణ వర్షాలు పడుతాయని, దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వంద శాతం నమోదవుతుందని తెలిపారు. ‘కరోనాతో అష్టకష్టాలు పడుతున్న ఈ సమయంలో సాధారణ వర్షపాతం నమోదవనుండటం నిజంగా శుభవార్తే. ఇది వ్యవసాయరంగానికి ఎంతో ఉపకరిస్తుంది. మంచి దిగుబడులు వస్తాయి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. గత ఏడాది భారత్‌లో సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురిసింది. 

ఈ ఏడాది నుంచి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించే తేదీల అంచనాలను సైతం ఐఎండీ మార్చింది. 1901-1940 మధ్య రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తేదీలను బట్టి గతంలో అంచనా వేసేవారు. ఈ ఏడాది నుంచి 1960-2019 మధ్య నమోదైన సమాచారం ఆధారంగా సవరించారు. అయితే రుతుపవనాల ప్రారంభ తేదీలో ఎలాంటి మార్పులేదని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం రాజీవన్‌ తెలిపారు. 

జూన్‌ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చని భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బీహార్‌, యూపీలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం గతంలోకన్నా 3-7 రోజులు ఆలస్యంగా జూన్‌ 27 నుంచి రుతుపవనాలు విస్తరిస్తాయని చెప్పారు. అక్టోబర్‌ 15 తర్వాతి నుంచి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

వివిధ సంస్థల అంచనా ప్రకారం రెండో అర్ధభాగంలోనూ సాధారణ వర్షాలే కురువొచ్చని చెప్తున్నారు. తెలంగాణలో దక్షిణ దిశ నుంచి గాలులు వీస్తున్న కారణంగా ఉత్తర తెలంగాణలోని కొన్నిచోట్ల రాగల 48 గంటల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అదే సమయంలో హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని చాలాప్రాంతాల్లో ఎండల తీవ్రత పెరుగనున్నది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల సెల్సియస్‌ తాకే అవకాశాలున్నాయి.