ఎంఎస్‌ఎంఈల బలోపేతం కోసం మరో ప్యాకేజి 

కరోనా ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను బయటపడేసేందుకు కేంద్రప్రభుత్వం మరో భారీ ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వాలని భావిస్తున్నది.  రూ 1.7లక్షల కోట్లతో ప్రకటించిన మొదటి ప్యాకేజీలో ప్రధానంగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించటం, అత్యవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపర్చటంపైనే దృష్టి పెట్టారు. 

అయితే రెండో ఉద్దీపన ప్యాకేజీలో మాత్రం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) బలోపేతం చేయటంపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తున్నది. రెండో ప్యాకేజీలో ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక నిధిని ఏర్పాటుచేయాలని కేంద్ర ఆర్థికశాఖ ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరిందని అధికారవర్గాలు తెలిపాయి.

లాక్‌డౌన్‌తో మూతపడిన ఈ పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు మూలధన సహాయంతో పాటు వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్రం ఏర్పాటు చేసే నిధి నుంచి కొంత మొత్తాన్ని కార్మికుల ప్రోత్సాహకాలకు కూడా కేటాయించే అవకాశం ఉందని తెలుస్తున్నది. దేశంలో అత్యధిక మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది ఎంఎస్‌ఎంఈలే కావడం గమనార్హం.