చైనా ఆరు రోజుల ఆలస్యంతో కరోనా ప్రళయం 

కరోనా వైరస్ గురించిన సమాచారం ఇవ్వడంలో చైనా ఆరు రోజులు ఆలస్యం చేయడంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రళయం నెలకొన్నదని స్పష్టమవుతున్నది. వైరస్‌కి సంబంధించిన సమాచారాన్ని ఆరు రోజుల పాటు దాచిపెట్టి.. వుహాన్‌లో మహమ్మారి విరుచుకుపడటానికి పరోక్షంగా కారణమయిన్నట్లు వెళ్ళాడు అవుతున్నది. 

ప్రఖ్యాత న్యూస్‌ ఏజెన్సీ ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌' తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులకు కరోనానే కారణమని జనవరి 14న అధికారులు నిర్ధారణకు వచ్చినప్పటికీ, ప్రధాని జిన్‌పింగ్‌ ఆ విషయాన్ని ప్రజలకు ఆరు రోజులు ఆలస్యంగా అంటే జనవరి 20న తెలియజేశారు. అయితే, అప్పటికే 3 వేల మందికి పైగా వైరస్‌ సోకిందని వెల్లడించింది. 

చైనా కొత్త సంవత్సర ఉత్సవాలు (లూనార్‌ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌) కొనసాగుతుండటంతో వేలాది మంది చైనా ప్రజలు  ఇతర ప్రాంతాలకు, పలు దేశాలకు ప్రయాణాలు సాగించడంతో ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఐరోపా, అమెరికాలలో వేగంగా వ్యాపించింది.  అధికార వర్గాలకు సంబంధించిన అంతర్గత పత్రాల్లో ఈ విషయాలు ఉన్నాయని తెలిపింది. 

ఒకవేళ అధికారులు ఆరు రోజుల ముందే వైరస్‌ గురించి ప్రజలను హెచ్చరిస్తే, కరోనా రోగులు తక్కువగా ఉండేవారని, రోగుల చికిత్సకు తగినన్ని వైద్య సదుపాయాలు ఉండేవని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే  వైరస్‌ గురించి తెలిసిన వెంటనే ఆ సమాచారాన్ని ప్రజలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చేరవేశామని చైనా వాదిస్తున్నది. 

కాగా, అమెరికాలో కరోనా విస్తరణ సంబంధించి అత్యంత ప్రమాదకరమైన స్థితి తొలగిపోయినట్లేనని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆర్థికవ్యవస్థను తిరిగి తెరిచే అంశంపై గురువారం మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపారు. 

‘కరోనాపై మన తీవ్రమైన పోరాటం ఫలితం ఇస్తున్నదని స్పష్టమైంది. మన పోరాటం కొనసాగుతుంది. అయితే అత్యంత కష్టమైన వారాన్ని మనం దాటేశామని మన దగ్గర ఉన్న డాటా స్పష్టం చేస్తున్నది’ అని ట్రంప్‌ ప్రకటించారు.

కరోనాపై పోరాటం సానుకూల ఫలితాలు ఇస్తున్నందున ఇప్పుడు ధైర్యంగా ఆర్థిక వ్యవస్తను తిరిగి తెరిచే మార్గదర్శకాలు రూపొందించవచ్చు అని ట్రంప్‌ తెలిపారు. వచ్చే నవంబర్‌లోనే అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో వీలైనంత త్వరగా కరోనా  ప్రభావం నుంచి దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను బయటపడేయాలని ట్రంప్‌ చర్యలు చేపట్టినట్లు రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు.