లాక్ డౌన్ అమలు తీరుపై బెంగాల్ గవర్నర్ అసహనం 

పశ్చిమ బెంగాల్ లో లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలు కావడం పట్ల  పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్దీప్‌ ధంఖర్‌ అసహనం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో వైఫల్యం చెందుతున్న అధికారులను విధుల నుంచి తొలగించాలని మమతా బెనర్జీ సర్కారుకు సూచించారు.

‘‘కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు.. విధించిన లాక్‌డౌన్‌ను 100 శాతం అమలు చేయడంలో విఫలమైన పోలీసులు, అధికారులను తొలగించాలి. మతపరమైన సమ్మేళనాలు జరగకుండా చూడటంలో వాళ్లు వైఫల్యం చెందారు. లాక్‌డౌన్‌ను విజయవంతం చేసేందుకు కేంద్ర బలగాల మోహరింపు అంశాన్ని పరిశీలించాల్సి ఉంది’’అని ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా రాష్ట్రంలో పలు చోట్ల (మైనార్టీలు ఎక్కువగా ఉన్న చోట) లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేయడం లేదంటూ బీజేపీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది.  ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి మమత.. కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో నిఘా పెట్టాలంటూ కేంద్రం ప్రత్యేక చొరవ చూపిస్తోందని చురకలు అంటించారు.

కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నిజాముద్దీన్‌ తబ్లిగీ జమాత్‌ ఘటన విషయంలో మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘‘నో కమ్యూనల్‌ క్వశ్చన్స్‌’’అని మమత సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఆమెపై విమర్శల వర్షం గుప్పించింది.