రాబోయే మూడు వారాలు కీలకం  

కోవిడ్-19పై జరుపుతున్న పోరాటంలో రాబోయే మూడు వారాలు భారత్‌కు అత్యంత కీలకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. జనవరి 7న కరోనా వైరస్‌ను చైనాలో గుర్తించగానే మొదట స్పందించిన దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. 

జనవరి 8న నిపుణుల బృందంతో సమావేశం ఏర్పాటు చేశామని, జనవరి 17న హెల్త్ అడ్వయిజరీలు  విడుదల చేశామని చెప్పారు. కోవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్ మొదటి వరుసలో ఉందని చెబుతూ  ఈ విషయంలో ప్రపంచ దేశాలకు భారత్ ఒకర ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. 

 కరోనా ప్రభావం ముంబైపై తీవ్రంగా ఉందని హర్షవర్ధన్ తెలిపారు. దేశవ్యాప్తంగా రోజుకు లక్ష పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నామని, ఇంతవరకూ 2.5 లక్షల పరీక్షలు జరిపామని ఆయన చెప్పారు. 166 ప్రభుత్వ ల్యాబ్స్ పనిచేస్తున్నాయని, ల్యాబ్‌లు, పరీక్షల అప్‌గ్రేడేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. హట్‌స్పాట్‌లు, పాజిటివ్ కేసులపై నిరంతర నిఘా ఉందని పేర్కొన్నారు. 

ఇలా ఉండగా,  దేశవ్యాప్తంగా 11,439కు కరోనా పాజిటీవ్ కేసులు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1,076 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 377 మంది చనిపోగా.. కరోనా నుంచి 1,306 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు.

లాక్ డౌన్ తొలగింపునకు ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతూ కంటైన్ మెంట్ జోన్లలో అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్రాలకు సూచనలు చేశామని వివరించారు. దేశంలో హాట్ స్పాట్స్, గ్రీన్ జోన్లను గుర్తించామని తెలిపారు. 

మొత్తం 170 జిల్లాలను హాట్ స్పాట్ లుగా ప్రకటించగా, 207 జిల్లాలను హాట్ స్పాట్ లు కావని గుర్తించారు. హాట్ స్పాట్లలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వాలతో కేబినెట్ సెక్రటరీ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన వివరించారు.