పాతబస్తీలో వేగంగా విస్తరిస్తున్న కరోనా 

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో కరోనా వేగంగా విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. మూడు రోజులల్లో 50 కరోనా కేసులు నమోదయ్యాయి. పాతబస్తీలో మర్కజ్ లింకులు ఉండడంతో పరిస్థితి అదుపు తప్పుతుందా అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

అలాగే ఆయా కుటుంబాల్లో ఎవరైనా వృద్ధులు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు మాత్రమే అంత్యక్రియలకు హాజరవ్వవలసి ఉంది. 

ఇటీవల జరిగిన రెండు సంఘటనల్లో అంత్యక్రియలకు వారి బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మూడు రోజుల వ్యవధిలో 50కి పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

దీంతో పాతబస్తీలో మూడు ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించారు. తలాబ్ కట్ట, రమ్నస్‌పురా, అలీబాగ్. కాగా ఇప్పటివరకు హైదరాబాద్‌లో 300 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 

ప్పటికైనా పాతబస్తీలో యధేచ్ఛగా తిరుగుతున్నవారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తే గాని  వైరస్‌ను కొంత నియంత్రించే అవకాశం ఉండకపోవచ్చని అధికారులలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. 

ఆందోళన చెందుతున్న చాలామంది స్థానికులు ఎక్కడికక్కడ వీధి చివరిలో బ్యారికేడ్ లను ఏర్పాటు చేసుకొని, రాకపోకలను నిషేధిస్తున్నారు. పాత బస్తీలోని కొత్త ప్రాంతాలతో పాటు అవతలి వైపుకు కూడా వైరస్ విస్తరిస్తూ ఉండడం వారిని కలవరానికి గురిచేస్తున్నది. 

మరోవైపు పాతబస్తీలో వైద్యులు, ఆశావర్కర్లు ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ దిశలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేక పోతున్నది.