5 కోట్ల మంది ఆరోగ్యసేతు యాప్‌ డౌన్ లోడ్ 

 కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. 13 రోజులలో 5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 2016లో పోక్‌మాన్ గో గేమింగ్ యాప్‌ను 19 రోజుల్లో 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో ఎక్కువ డౌన్‌లోడ్ అయిన యాప్‌గా ఆరోగ్య సేతు రికార్డు సృష్టించింది.   

మోదీ పిలుపునిచ్చిన గంటల్లోనే కోటీ పది లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంకా చేసుకుంటున్నారు. 13 రోజుల్లో ఈ యాప్‌‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్ల నుంచి 5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. 

14వ తేదీ ఉదయం పది గంటలకు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పారు. ఆ తర్వాత నిమిషానికి లక్షమంది చొప్పున నమోదు చేసుకున్నారని, సగటున నిమిషానికి 20 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని నీతి ఆయోగ్ బృందంలోని ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ డైరక్టర్ అర్నబ్ కుమార్ తెలిపారు. యాప్‌ను అభివృద్ధి చేసిన టీమ్‌లో అర్నబ్ కూడా ఒకరు.

 కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అభివృద్ధి చేసిన ఈ యాప్ ఇంగ్లీష్‌తో పాటు 10 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. మీ పరిసరాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి కదలాడితే వెంటనే మీకు అలర్ట్‌ వస్తుంది. దీంతో మీరు అప్రమత్తమై ఇన్ఫెక్షన్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. 

యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసేందుకు బ్లూటూత్‌, లొకేషన్‌లను ఆన్‌ చేయాల్సి ఉంటుంది. ‘లొకేషన్‌ షేరింగ్‌’లో ‘ఆల్వేస్‌’ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. దీంతో యాప్‌ ఇన్‌స్టాలేషన్‌ పూర్తవుతుంది. ఇక లోపలికి ప్రవేశించగానే కరోనా లక్షణాలు మీకు ఉన్నాయా? లేదా? అనేది తేల్చే పలు ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. ఇందుకు 20 సెకన్లు కేటాయిస్తే చాలు. 

కరోనా లక్షణాలు ఉన్నాయని తేలితే వెంటనే ప్రభుత్వ సర్వర్‌కు సమాచారం వెళ్లిపోతుంది. దీని ఆధారంగా అధికార యంత్రాంగం సదరు వ్యక్తి లొకేషన్‌ను గుర్తించి, అతడిని ఐసొలేషన్‌ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. 

ఇలాంటి వారి సమాచారం యాప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి వాళ్లు వైద్య యంత్రాంగానికి చిక్కకుండా తిరుగుతూ.. మీ పరిసరాల్లోకి వస్తే బ్లూటూత్‌, అల్గారిథమ్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ల ఆధారంగా గుర్తించి మీ మొబైల్‌లోని ‘ఆరోగ్యసేతు’ యాప్‌ అలర్ట్‌ టోన్‌ను వినిపిస్తుంది.