స్వీయ నిర్బంధంలోకి గుజరాత్ సీఎం

గుజరాత్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ అని తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముందస్తు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 

అధికారుల సూచనల మేరకు సీఎం రూపానీ సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోని వెళ్లినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తెలిసింది. అహ్మ‌దాబాద్‌లోని జ‌మ‌ల్‌పూర్ ఖాదియా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేద్వాలాకు  క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ కావడంతో ఈ జాగ్రత్త తీసుకొంటున్నారు. 

ఇమ్రాన్ ఖేద్వాలా మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆయ‌న గ్యాసుద్దీన్ షైఖ్‌, శైలేష్ పార్మ‌ర్ అనే మ‌రో ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి గాంధీన‌గ‌ర్‌లోని సీఎం కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీతో భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ఉపముఖ్య‌మంత్రి నితిన్ ప‌టేల్‌, హోంమంత్రి ప్ర‌దీప్ సిన్హా జ‌డేజా, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

అనంత‌రం రాత్రి స‌మ‌యంలో ఎమ్మెల్యే ఇమ్రాన్‌కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. అయితే ఈ స‌మావేశంలో ప్ర‌తి ఒక్క‌రు‌ సామాజిక దూరం పాటించార‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ ఎమ్యెల్యేలు ఇద్దరు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. 

మరోవైపు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా బుధవారం నాటికి గుజరాత్‌లో 617 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవ్వగా.. మృతుల సంఖ్య 26కు చేరింది.