చైనాలో మళ్ళి పెరుగుతున్న కరోనా కేసులు

వుహాన్‌ నగరంలో వెలుగుచూసి ప్రపంచ దేశాలను విలవిల్లాడేలా చేస్తున్న కొవిడ్‌-19 కష్టాలు చైనాను వదలడం లేదు. ఇటీవలనే వైరస్ ను కట్టడి చేశామని స్థిమితపడుతూ లాక్‌డౌన్‌ను కూడా ఎత్తివేసిన చైనాకు తిరిగి  ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న రష్యా కారణంగా మళ్లీ ఆ మహమ్మారి దేశంలోకి ప్రవేశిస్తుండటం  కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. 

దీంతో రష్యా సరిహద్దులను మూసివేసిన ప్రభుత్వం.. వైరస్‌ కేసులు నమోదవుతున్న హెయిలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌కు వైద్య సిబ్బందిని హుటాహుటిన తరలించింది. సరిహద్దు నగరం సుఫెన్‌హేలో దాదాపు వెయ్యి వరకు నిర్ధారిత, అనుమానిత కేసులు నమోదవ్వడంతో సోమవారం రాత్రినాటికి ఓ ఫీల్డ్‌ దవాఖానను కూడా ఏర్పాటు చేసింది. 

కొత్త కేసులను గుర్తించడంతోపాటు, వైరస్‌ను కట్టడి చేయడానికిగానూ ఓ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వైరల్‌ డిసీజ్‌ కంట్రోల్‌కు చెందిన 22 మంది నిపుణులను అక్కడికి పంపించింది. ప్రావిన్స్‌ పరిధిలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో 243 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివేనని, మరో వంద మందికి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినప్పటికీ, వైరస్‌ లక్షణాలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. 

రష్యాతో చైనాకు మంచి వాణిజ్య సంబంధాలు ఉండటంతో ఎక్కువ మంది చైనీయులు ఆ దేశంలో పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఆయా దేశాలు ఆంక్షలు విధించడంతో హెయిలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌ గుండా చైనాలోకి పలువురు ప్రవేశిస్తున్నారు. దీంతో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. 

మరోవైపు, చట్టవిరుద్ధంగా సరిహద్దులను దాటి దేశంలోకి ప్రవేశించే వారిని పట్టుకొని, సంబంధిత అధికారులకు అప్పగించే వారికి 5 వేల యువాన్లను (రూ.54వేలు) నజరానాగా ఇస్తామని హెయిలాంగ్‌జియాంగ్‌ అధికారులు ప్రకటించారు. 

ఇలా ఉండగా, కరోనాను అరికట్టే వ్యాక్సిన్‌ను కనిపెట్టడంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఆ దేశ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయో టెక్నాలజీ పరిశోధన సంస్థ రెండోదశ ఔషధ పరీక్షల్ని మొదలు పెట్టి ఈ దశకు చేరుకున్న తొలి సంస్థగా నిలిచింది. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం మూడు వ్యాక్సిన్లకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని అధికార పత్రిక షిన్హువా తెలిపింది.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిలిటరీ మెడిసిన్‌కు చెందిన మేజర్‌ జనరల్‌ చెన్‌ వీ నేతృత్వంలో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మార్చి చివరి వారంలో తొలి దశ ముగియగా ఏప్రిల్‌ 12న రెండోదశ ఔషధ పరీక్షలు ఆరంభమయ్యాయి. రెండో దశలో 500 వలంటీర్లకు వ్యాక్సిన్‌  ఇచ్చారు. వుహాన్‌కు చెందిన 84 ఏండ్ల షియాంగ్‌ జెంగ్‌షింగ్‌ ఈ పరీక్షల్లో పాల్గొన్న పెద్ద వయస్కుడిగా పత్రిక పేర్కొంది.