రష్యాతో ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థ ఒప్పందం

ఒక వంక అమెరిక ఆంక్షల నీలినీడల మధ్య, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్‌, రష్యాల మధ్య ఒప్పందం కుదిరిందని, ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.. ఐదు ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థలను భారత్‌ 5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో కొనుగోలు చేస్తోంది.

రష్యా నుంచి ఎస్‌-400ను కొనుగోలు చేయొద్దని అమెరికా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్‌ వాటి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. చైనా 2014లోనే ఎస్‌-400 కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు భారత్‌ కుదుర్చుకున్న డీల్‌తో ఈ క్షిపణి వ్యవస్థ పొందే మూడో దేశం కానుంది. అత్యాధునిక గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ అయిన ఎస్‌-400 ద్వారా భూ ఉపరితలం నుంచి గగనతలంలో 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించవచ్చు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈరోజు భారత్‌-రష్యా 19వ వార్షిక శిఖరాగ్ర ద్వైపాక్షిక సదస్సులో పాల్గొన్నారు. దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో‌ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. మోదీ, పుతిన్‌ ఈ సదస్సులో ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై చర్చించారు. సమావేశంలో పుతిన్‌తో పాటు రష్యా ఉప ప్రధాని యురి బొరిసోవ్‌, విదేశాంగ మంత్రి సెర్‌గే లవరోవ్‌, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డెనిస్‌ మన్‌టురోవ్‌ పాల్గొన్నారు.

ఈ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత్, రష్యా దేశాలు ఎస్‌-400 ట్రయంఫ్‌ క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో పాటు పలు కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సైబీరియాలోని నోవోసైబిర్‌స్క్‌ అనే నగరం సమీపంలో‌ భారత్‌ పర్యవేక్షణ కేంద్రాన్ని నిర్మించనుంది.