హెచ్‌-1బీ వీసా గడువు 8 నెలలకు పొడిగింపు   

కరోనా నేపథ్యంలో అమెరికాలో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయ ఉద్యోగులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. హెచ్‌-1బీ వీసా గడువును 8 నెలల వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్‌) ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

‘వీసా గడువు ముగిసిపోయినప్పటికీ కొందరు విదేశీయులు అమెరికాలోనే ఉన్నట్టు మేము గుర్తించాం. కరోనా కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయి. వీసా గడువును పొడిగించాల్సిందిగా వచ్చే దరఖాస్తులను అనుమతిస్తాం’ అని పేర్కొంది. 

ఇదే సమయంలో తమ దేశ పౌరుల ఉద్యోగ అవకాశాలను పరిగణలోకి తీసుకుంటామని డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. అభ్యర్థులు సరైన సమయంలో దరఖాస్తు చేస్తే వారిని చట్టవిరుద్ధంగా ఉంటున్న వారిగా పరిగణించబోమని, వారి వీసా గడువును 240 రోజుల వరకు పొడిగిస్తామని స్పష్టం చేసింది.   

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ దేశాల సరిహద్దుల్ని మూసేసి, అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకల్ని నిలిపేసిన క్లిష్ట సమయంలో ఈ ప్రకటన వెలువడింది. విమానాల రద్దుతో, రాకపోకలపై ఆంక్షలతో త్వరలో గడువు ముగియబోతున్న హెచ్ 1బి హోల్డర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీసాల గడువు తీరనున్న వారు గడువు పెంచమని కోరుతూ దాఖలుచేసే దరఖాస్తుల్ని ఆమోదించే ప్రక్రియను డిహెచ్‌ఎస్ త్వరలోనే ప్రారంభించబోతోంది.