డ‌బ్ల్యూహెచ్‌వో కు నిధులు నిలిపివేసిన ట్రంప్  

కరోనా వైరస్ విషయంలో చైనా ప్రభావానికి లోనయి మిగిలిన ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌పై అగ్రరాజ్యాలు ప్రతీకార చర్యలకు దిగడం ప్రారంభమైనది. తొలుతగా ఈ సంస్థ నిధులలో 15 శాతం వరకు  సమకూరుస్తున్న అమెరికా నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

నిధుల‌ను నిలిపివేయాల‌ని త‌మ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ వెల్లడించాయిరు. హౌట్‌హౌజ్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడాడుతూ ప్రాథ‌మిక క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ‌లో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైంద‌ని ట్రంప్ విమ‌ర్శించారు.  క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అరిక‌ట్ట‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఎటువంటి చేయూత‌ను ఇవ్వ‌లేద‌ మండిపడ్డారు. 

చైనాలో వైర‌స్ ఛాయ‌లు క‌నిపించిన త‌ర్వాత‌.. ఆ విష‌యాన్ని ప్ర‌పంచ‌దేశాల‌కు డ‌బ్ల్యూహెచ్‌వో తెలియ‌జేయ‌లేద‌ని ట్రంప్ ప్రధానంగా గత నెలరోజులుగా  విమర్శలు కురిపిస్తున్నారు.  నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన డ‌బ్ల్యూహెచ్‌వోపై దానికి బాధ్య‌త తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. చైనాకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు గ‌తంలోనూ డ‌బ్ల్యూహెచ్‌వోపై ట్రంప్ ఆరోప‌ణ‌లు చేశారు. 

క‌రోనా క‌ట్ట‌డి నియంత్ర‌ణ‌లో ట్రంప్ విఫ‌ల‌మైన‌ట్లు అమెరికాలో ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న డ‌బ్ల్యూహెచ్‌వోపై తిరుగుబాటుకు దిగారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌నితీరుపై తమ అధికారులు స‌మీక్ష చేస్తున్నార‌ని, కానీ ఈ లోపు నిధుల‌ను ఆపివేయాల‌ని ఆదేశించాన‌ని ట్రంప్ ప్రకటించారు. వైర‌స్ విష‌యాన్ని ఆ సంస్థ క‌ప్పిపుచ్చింద‌ని మరోసారి ట్రంప్ స్పష్టం చేశారు. 

గ‌త ఏడాది డ‌బ్ల్యూహెచ్‌వోకు అమెరికా 40 కోట్ల డాల‌ర్లు ఇచ్చింది. ఇది దాని బ‌డ్జెట్‌లో 15 శాతం క‌న్నా త‌క్కువే. ఇక చైనా డ‌బ్ల్యూహెచ్‌వోకు 2018-19 సంవ‌త్స‌రంలో 7.6 కోట్ల డాల‌ర్ల నిధుల‌ను అంద‌జేసింది. దీంతో పాటు ప‌ది మిలియ‌న్ల డాల‌ర్ల వాలెంట‌రీ ఫండింగ్ చేసిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో త‌న‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్న‌ది. 

ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు సుమారు 675 మిలియ‌న్ల డాల‌ర్లు కావాలంటూ మార్చిలో డ‌బ్ల్యూహెచ్‌వో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాదు మ‌రో బిలియ‌న్ డాల‌ర్లు కావాలంటూ మ‌రో అభ్య‌ర్థ‌న చేసేందుకు డ‌బ్ల్యూహెచ్‌వో సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది.   ఇలాంటి స‌మ‌యంలో నిధుల‌ను ఆపివేయ‌డం దారుణ‌మ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ విచారం వ్యక్తం చేశారు.