భారతీయ గబ్బిలాల్లో కరోనా వైరస్

దేశంలోని రెండు తెగల గబ్బిలాల్లో కరోనా వైరస్ పరాన్నజీవులను మొట్టమొదటి సారి పరిశోధకులు కనుగొన్నారు. ఈ మేరకు ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి) ఆధ్వర్యాన ఇండియన్ ఫ్లయింగ్‌ఫాక్స్, రూసెట్టస్ అనే రెండు తెగల గబ్బిలాలపై జరిగిన అధ్యయనంలో బయటపడింది. 

కేరళ, తమిళనాడు, హిమాచలప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన ఈ తెగల 25 గబ్బిలాల నుంచి సేకరించిన నమూనాలపై పరిశోధన జరిపారు. ఆర్‌టిపిసిఆర్ పరీక్షల ద్వారా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి.

భారీ ఎత్తున మొదటి సారి గబ్బిలాల కరోనా వైరస్‌పై జరుగుతున్న అధ్యయనంలో ఇదో భాగం. పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) శాస్త్రవేత్తల బృందంతో కలసి ఐసిఎంఆర్ సాగించిన ఈ అధ్యయనం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చిలో వెలువడింది. 

సార్స్ వైరస్ నుంచి వచ్చే ఈ కరోనా వైరస్‌కు గబ్బిలాలు, అలుగులతో సంబంధం ఉంది. అయితే గబ్బిలాల నుంచి మనుషులకు మధ్యంతర తెగల ద్వారా సంక్రమిస్తుందని చెప్పడానికి సరైన ఆధారాలు ఇంతవరకు దొరక లేదు. 2018 నుంచి 2019 సంవత్సరాల మధ్య ఆయా రాష్ట్రాల అడవుల్లోని గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించి అధ్యయనం సాగించారు.