రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా చర్యలు 

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనం వల్ల రైతుల వ్యవసాయ కార్యకలాపాలు ప్రభావితం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందని  కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భరోసా ఇచ్చారు.   

రైతులు ఏ విధంగానూ నష్టపోకుండా, ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. పంటల కోతలు సజావుగా జరగడానికి తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. 

కాగా,  కోవిడ్-19 మహమ్మారిని త్వరలోనే మన దేశం అధిగమిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ మహమ్మారితో మనం ఇతర దేశాలతో పోల్చినపుడు బాగా పోరాడామని పేర్కొన్నారు. మనం ఈ సంక్షోభం నుంచి త్వరలోనే బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

దేశవ్యాప్త అష్ట దిగ్బంధనాన్ని పొడిగించాలని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి  చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి అవసరమైన అన్ని చర్యలను భారత దేశం తీసుకుంటోందని తెలిపారు. ఈ కేసుల సంఖ్య పెరగకుండా మనం నియంత్రించగలిగామని పేర్కొన్నారు.