వలస కార్మికుల నిరసనలతో బాంద్రాలో తీవ్ర ఉద్రిక్తత 

ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోతామని అంటూ వేల  లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారు. తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ  గుమికూడి  రోడ్లపైకి రావడంతో తీవ్ర  ఉద్రిక్త  నెలకొంది. 

 సత్వరమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోకపోవడంతో లాఠీఛార్జ్ చేయవలసి వచ్చింది.  అలా చేయ‌గానే.. వాళ్లంతా ప‌రుగులు తీశారు. వాళ్లు ఎక్క‌డికి వెళ్లారు ?  కేవ‌లం కొన్ని నిమిషాల్లో మ‌ళ్లీ వారంతా క‌నిపించ‌కుండా ఎక్కడికి పోయారు?  లాక్‌డౌన్ ఉన్న స‌మ‌యంలో.. ప్ర‌జ‌లు ఎలా భారీ సంఖ్య‌లో ఒకేచోటుకు వ‌చ్చారు? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

వేల సంఖ్యలో స్టేషన్‌ దగ్గర గుమిగూడిన కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని డిమాండ్‌ చేశారు. వలసకూలీలంతా ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.   తమకు రాష్ట్ర ప్రభుత్వం ఆహారం అందించాలి లేదా తమ ప్రాంతాలకు వెళ్లి పోవడానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. 

అకస్మాత్తుగా ఆంక్షల సమయంలో అంతమంది గుమికూడడం సాధ్యం కాదని, అంతా సంఘటితంగా జరిగి ఉంటుందని, ఇదంతా రాష్త్ర ప్రభుత్వ నిఘా వైఫల్యమని విమర్శలు చెలరేగుతున్నాయి. ముంబైలో సుమారు 300 ప్రాంతాల్లో వలస కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పాక్షిక వ‌స‌తి ఏర్పాట్లు చేయగా  ఇలా సునామీలా స్టేష‌న్ వ‌ద్ద‌కు జ‌నం ఎలా వ‌చ్చారో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.   

బాంద్రా ఘ‌ట‌న‌పై మంత్రి  ఆదిత్య థాక‌రే ట్వీట్ చేస్తూ శ‌ర‌ణార్థి శిబిరాలలో ఉండేందుకు వ‌ల‌స కూలీలు నిరాక‌రిస్తున్న‌ట్లు  తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో ఏర్పాటు చేసిన షెల్ట‌ర్ క్యాంపుల్లో సుమారు 6 ల‌క్ష‌ల మంది ఆశ్ర‌యం పొందుతున్న‌ట్లు చెప్పారు. 

అసలే మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబై నగరంలో  దేశం మొత్తం మీద కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది.  భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ముంబైలో కొత్తగా 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 

దీంతో.. ఒక్క ముంబైలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,753కు చేరింది. 24 గంటల వ్యవధిలో ముంబైలో కరోనా బారిన పడిన వారిలో 11 మంది మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ ముంబైలో 111 కరోనా మరణాలు నమోదయ్యాయి.

 ముంబైలోని బాంద్రాలో వలస కార్మికులు భారీ ఎత్తున గుమిగూడటంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు అమిత్ షా మంగళవారం ఫోన్ చేసి, ఇటువంటి పరిణామాలు కోవిడ్-19పై పోరుకు విఘాతం కలిగిస్తాయని పేర్కొన్నారు. 

ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడటం వల్ల భారత దేశం కోవిడ్-19పై చేస్తున్న యుద్ధం బలహీనపడుతుందని అమిత్ షా చెప్పారు. ఇటువంటి సంఘటనలను నిరోధించేందుకు పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.