ఉస్మానియాలో పిజి డాక్టర్లపై దాడి  

గాంధీ ఆసుపత్రిలో గత నెలలో కరోనా ఇసోలాటిన్ వార్డ్ లో డాక్టర్లపై రోగులు దాడి చేసిన సంఘటనను మరవక ముందే తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో పీజీ డాక్టర్లపై దాడి జరిగింది. 

మంగళవారం ఉదయం ఉస్మానియాలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వాళ్ళను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు.అయితే, ఐసోలేషన్ వార్డులోని ఇద్దరికి పాజిటివ్ రావడంతో.. అదే వార్డులో ఉన్న కరోనా అనుమానితుడు అన్వర్ అలీ తండ్రి డాక్టర్స్ పై దాడి చేశాడు. 

పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో తన కొడుకును ఇంటికి తీసుకుపోతానని డాక్టర్స్ తో తండ్రి ఘర్షణకు దిగాడు. రిపోర్ట్స్ వచ్చేవరకు ఇక్కడే ఉండాలని వైద్యులు స్పష్టం చేయడంతో పేషంట్ తండ్రి, డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

ఈ ఘర్షణలో పిజి డాక్టర్ల పై దాడి చేసిన రోగిపై తండ్రితో విచారం వ్యక్తం చేయించి, వివాదానికి తెరదింపేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నించినట్లు తెలిసింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వారిని శాంతపరచడం తప్ప కేసు నమోదు చేయలేదని తెలుస్తున్నది. 

గాంధీ ఆసుపత్రిలో గాని, ఆ తర్వాత రాష్ట్రంలో ఇతరత్రా గాని కరోనా వైద్యంలో ఉన్న సిబ్బందిపై జరుగుతున్న దాడులకు పాల్పడుతున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతూ ఉండడంతో ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. 

ఈ సంఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అత్యవసర సమావేశం జరపాలని నిర్ణయించింది.