లాక్‌డౌన్ గురించి ఆందోళ‌న వ‌ద్దు

లాక్‌డౌన్ పొడగింపుతో దేశంలోని ప్రజలెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భరోసా కల్పించారు. దేశంలో సరిపోయేంత నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, మందులు అందుబాటులోనే ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. 

‘‘దేశంలో సరిపోయేంత ఆహార నిల్వలున్నాయి. ఔషధాలు, నిత్యావసర సరుకుల నిల్వలూ ఉన్నాయి. వాటి గురించి ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర హోంమంత్రిగా భరోసానిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.  

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి దేశ ప్రజలను రక్షించడానికే ప్ర‌ధాని నరేంద్ర  మోదీ మరికొన్ని రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడగించారని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌ సమయంలో కొంత‌మంది పేదలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేన‌న్న హోంమంత్రి.. దేశంలోని ధనవంతులంద‌రూ తమ సమీపంలో ఉండే పేదవారికి సాయం చేయాలని అభ్యర్థించారు. 

లాక్‌డౌన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం రాష్ట్రాలతో చర్చిస్తూ, సమన్వయం చేస్తూనే ఉందని, అయినా సరే, సమన్వయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. లాక్‌డౌన్‌ పొడగింపుతో ప్రజలందరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  

ఈ ఆపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరిస్తున్న విధానం ప్రశంసనీయమని అమిత్‌ షా కొనియాడారు. ఇదే స్ఫూర్తిని, సమన్వయాన్ని కొనసాగిస్తూ లాక్‌డౌన్‌ను మరింత పకడ్బంధీగా అమలు చేయాల‌ని సూచించారు. 

ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు ఇస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. క‌రోనా మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సహకారం ఎంతో అద్భుత‌మ‌ని హోంమంత్రి ప్ర‌శంసించారు.  వారి నుంచి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతున్నారని అమిత్‌షా పేర్కొన్నారు.