లాక్‌డౌన్‌పై హోంశాఖ ఏకీకృత మార్గదర్శకాలు  

కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌పై కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలకు ఏకీకృత మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్‌డౌన్ సందర్భంగా  అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల మూసివేత కొనసాగుతుందని తెలిపింది. 

అయితే రక్షణ, కేంద్ర సాయుధ బలగాలు, ప్రజా వినియోగాలు, విద్యుదుత్పత్తి, సరఫరాల విభాగాలు, పోస్ట్ ఆఫీసులు, విపత్తుల నిర్వహణ, ముందస్తు హెచ్చరిక కేంద్రాలు, జాతీయ సమాచార కేంద్రాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ గుర్తింపు ఉన్న ఆర్ధిక సంస్థలు తదితర సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 

రాష్ట్రాల విషయానికొస్తే.. పోలీసులు, అత్యవసర సేవలు, జిల్లా యంత్రాంగం, ట్రెజరీ, విద్యుత్, నీరు, పారిశుద్ధ్యం, మున్సిపాలిటీలు మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో లాక్‌డౌన్ అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. 

అటవీ శాఖ కార్యాలయాలు,  సాంఘిక సంక్షేమ శాఖ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విభాగాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమీటీల నేతృత్వంలోని ‘మండీలు’ తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. కోల్డ్ స్టోరేజిలు, వేర్‌హౌస్ సర్వీసులు, నిత్యావసరాల రవాణా తదితర సేవలకు కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగనుంది.  

ఆస్పత్రులు, వెటర్నరీ ఆస్పత్రులు, ఫార్మసిటీలు, లేబొరేటరీలు, క్లినిక్‌లు సహా అన్ని వైద్య, ఆరోగ్య సంబంధిత విభాగాలు కూడా యధాతథంగా పనిచేస్తాయి. వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రయాణ సౌకర్యాలను కూడా లాక్‌డౌన్ నుంచి మినహాయింపు కొనసాగుతుంది. 

కాగా నిత్యవసరాలు మినహా అన్ని వాణిజ్య, ప్రయివేటు సంస్థలు లాక్‌డౌన్ సమయంలో మూసివేస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యునికేషన్లు, ఇంటర్నెట్ సేవలు, ప్రసార, కేబుల్ సర్వీసులు, అత్యవసర ఐటీ సేవలకు లాక్‌డౌన్ నుంచి యధాతథంగా మినహాయింపు ఉంటుంది. 

పారిశ్రామిక సంస్థలు, ప్రజా రవాణా సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్లకు లాక్‌డౌన్ సమయంలో నిషేధం కొనసాగనుంది.  ఫిబ్రవరి 15 తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన విదేశీయులకు క్వారంటైన్‌ నిబంధనలను కఠినంగా కొనసాగించనున్నట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. 

లాక్‌డౌన్ మినహాయింపులతో సంబంధం లేకుండా అన్ని చోట్లా సామాజిక దూరం పాటించడం, పరిశుభ్రత పాటించడం వంటి ప్రత్యేక నియమాలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. జిల్లా యంత్రాంగాలు దీని బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది.

కాగా  రేపు లాక్‌డౌన్‌ నిబంధనలపై పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.