మే 3 వరకు లాక్‌డౌన్ పొడిగింపు  

నేటి రాత్రితో ముగియనున్న మూడు వారల లాక్‌డౌన్ ను మరో 19 రోజుల పాటు, మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రకటించారు.  ప్రధాని మోదీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మే 20 తర్వాత దశల వారిగా సడలింపగలమని చెప్పారు.  ఈ విషయమై మార్గదర్శక సూత్రాలను రేపు ప్రకటింపగలమని తెలిపారు. 

అయితే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు వచ్చే వారం రోజులపాటు మరింత కఠినంగా ఉండగలదని సూచిస్తూ ప్రతి రాష్ట్రంలో, జిల్లాల్లో, ప్రాంతంలో, ఆసుపత్రిలో ఏ విధంగా అమలు చేస్తున్నారేమో కేంద్రం సునిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. వారు అమలు జరిపిన తీరును బట్టి సడలింపులు ఉండవచ్చనే సంకేతం ఇచ్చారు. 

చాలా ముందుగా సమిష్టిగా సమ్మిళిత చర్యలు తీసుకోవడం కారణంగా ప్రపంచంలో అనేక దేశాలలో కన్నా మన దేశంలో కరోనా తీవ్రత తక్కువగా ఉన్నదని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకముందే   స్క్రీనింగ్ ప్రారంభించామని, పాజిటివ్ కేయూస్లు 500 కు చేరుకోక ముందే లాక్‌డౌన్ ప్రకటించామని ప్రధాని గుర్తు చేశారు. 

ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్‌డౌన్ అమలు కోసం సహకరించినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ  తెలిపారు. ‘‘ కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. లాక్‌డౌన్ కష్టాలు తట్టుకుని ప్రతిఒక్కరూ దేశాన్ని కాపాడుకుంటున్నారు. దేశ ప్రజలు ఎన్నికష్టాలు ఎదుర్కొంటున్నారో నేను అర్థం చేసుకోగలను" అని పేర్కొన్నారు. 

దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కరోనాపై భారత్ బలంగా పోరాడుతోంది. ప్రజలు ఎన్నో కష్టాలు పడి భారత్‌ను రక్షించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉంది. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలని ప్రధాని తెలిపారు. 

 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ  భారత ప్రజలంతా సామూహిక బలాన్ని ప్రదర్శించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. 

‘‘కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా కట్టడిలో ముందుంది. 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశం సమర్థంగా అమలు చేసింది. ఇతర దేశాల్లో మన కంటే 20, 30 శాతం ఎక్కువ కేసులు ఉన్నాయి...’’ అని ప్రధాని వివరించారు. 

వేగంగా నిర్ణయాలు తీసుకుని కరోనా మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశామని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచంలోని పెద్దపెద్ద దేశాలతో పోల్చితే.. మన దేశం పరిస్థితి బాగుందని భరోసా వ్యక్తం చేశారు. ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు కరోనా కేసులు 25 రెట్లు ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు.