పేదల కోసం కేంద్రం రూ 30,000 కోట్లు ఖర్చు 

లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు కేంద్రం అండగా నిలుస్తోంది. ఈ సమయంలో ఆకలితో ఇబ్బంది పడకుండా నిత్యావసరాల కొనుగోలుకు నేరుగా  నగదు  సహాయం అందిస్తోంది. ఇందుకోసం పలు పథకాల కింద 32 కోట్ల మందికి దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 

పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలోని దాదాపు 7 కోట్ల మంది రైతులకు వారి బ్యాంక్ అకౌంట్ లో రూ. 2000 జమచేసింది. రూ. 13,855 కోట్లు వారికి అందజేసింది. జన్ ధన్ యోజన ఖాతా ఉన్న ప్రతి మహిళ అకౌంట్ లో రూ. 500 జమచేసింది. దాదాపు 20 కోట్ల మందికి ఈ ప్రయోజనం అందింది. 

నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రొగ్రాం ద్వారా 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఖాతాలో డెరెక్ట్ గా రూ.1000 జమ చేసింది. 2.16 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 3066 కోట్లనగదు సహాయం అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనుంది. 

ఉజ్వల స్కీమ్ కింద వచ్చే మూడు నెలల పాటు 8.3 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సిలిండర్ అందజేయనున్నారు. కరోనా కారణంగా ఉపాధి లేని వారిని ఆదుకునేందుకు ఈ సహాయం అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.