లాక్‌డౌన్ కాలంలో రూ 8 లక్షల కోట్ల నష్టం 

నోవెల్ క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసే నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం మూడు వారాలపాటు అమలు జరిపిన లాక్‌డౌన్ ఫలితంగా భారత్ ఆర్థిక‌వ్య‌వ‌స్థ సుమారు రూ 8 ల‌క్ష‌ల కోట్లు న‌ష్ట‌పోనున్న‌ట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  ప్ర‌పంచంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన అతిపెద్ద దేశం మ‌న‌ది. మార్చి 25వ తేదీ నుంచి ఆ ఆంక్ష‌లు అమ‌లులోకి వ‌చ్చాయి. 

దాంతో దేశ‌వ్యాప్తంగా 70 శాతం ఆర్థిక వ్య‌వ‌హారాలు నిలిచిపోయాయి. పెట్టుబ‌డులు, ఎగుమ‌తులు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. కేవ‌లం వ్య‌వ‌సాయం లాంటి నిత్యావ‌స‌రాలు మాత్ర‌మే న‌డిచాయి. నోట్ల రద్దు నుంచి కోలుకుంటున్న త‌రుణంలో మ‌రో భారీ విఘాతం క‌రోనా రూపంలో భార‌త్‌ను నిర్వీర్యం చేసింది.  

దీంతో భార‌త్ మ‌ళ్లీ త‌న ఆర్థిక సంవ‌త్స‌రంలో వృద్ధిని కేవ‌లం సింగిల్ డిజిట్‌లోనూ చూపిస్తుంద‌ని సెంట్ర‌మ్ ఇన్‌స్టిట్యూష‌న‌ల్ రీస‌ర్చ్ పేర్కొన్న‌ది.  దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ వల్ల ఏడు నుంచి ఎనిమిది కోట్ల న‌ష్టం రానున్న‌ట్లు ఆ సంస్థ పేర్కొన్న‌ది.  ప్ర‌తి రోజు రూ 35వేల కోట్ల న‌ష్టం వ‌స్తుంద‌ని అకైట్ రేటింగ్స్ అండ్ రీస‌ర్చ్ లిమిటెడ్ పేర్కొన్న‌ది. ఈ లెక్క‌న 21 రోజుల్లో జీడీపీ న‌ష్టం రూ  7.5 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంది. 

తొలి 15 రోజుల్లో దాదాపు రూ.35,200 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామని అఖిల భారత మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌ తెలిపింది. నిర్మాణ రంగం రూ.లక్ష కోట్లు నష్టపోయిందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ తెలిపింది. రిటైల్‌ రంగానికీ నష్టం జరిగిందన్న నిపుణులు.. 7 కోట్ల చిన్న, మధ్య, భారీ ట్రేడర్లు 45 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నారని గుర్తుచేశారు.