మరో ఆరు వారాలకు సరిపడా టెస్టింగ్ కిట్లు  

టెస్టింగ్‌ కిట్ల విషయంలో సరిపడా స్టాక్‌ ఉందని, ప్రస్తుతం మరో ఆరు వారాలకు సరిపడా కిట్లు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని   భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన అధికారి రమణ్‌ ఆర్‌ గంగా ఖేద్కర్‌ వెల్లడించారు. దేశంలో ఇప్పటికి 2 లక్షల మందికి పరీక్షలు జరిపినట్లు చెప్పారు. 

చైనా నుంచి తొలివిడతగా బయలుదేరిన‌ టెస్టింగ్‌ కిట్లు ఈ నెల 15 కల్లా చేరుకుంటాయని చెప్పారు. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య లారీల రవాణాకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటించింది.  

మరోవంక, భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 9,352కి చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 8,048 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి  980 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా  324 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో మరో 51 మంది మరణించగా.. కొత్తగా 905  కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇవాళ ఒక్కరోజే తమిళనాడులో కొత్తగా 98 కరోనా కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,173కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 మంది చనిపోయారు. తమిళనాడు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పలనిస్వామి ప్రకటించారు. 

మరోవైపు కేరళలో సోమవారం కేవలం 3 కేసులు మాత్రమే నమోదు కావడంతో మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 378కి చేరింది.