యువమోర్చా కార్యకర్తలు రక్తదానం చేయాలి 

కరోనా వైరస్ కట్టడికి చేపట్టిన లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలోని ఆసుపత్రులలో లో పూర్తిగా రక్తనిల్వలు తగ్గిపోయి అనేక మందికి అత్యవసరంలో రక్తం అందడం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రక్తదాననికి బీజేపీ యువమోర్చా కార్యకర్తలు ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 

కరోనా మహమ్మరిని ఎదుర్కోవడానికి ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన లాక్ డౌన్ ప్రజలు పాటించడం అభినందనీయం అని, ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాధి గ్రస్తులకు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం అందడం లేదని, ముఖ్యంగా తలసేమియా వ్యాధి గ్రస్తులకు ప్రతి రోజు ట్రాన్స్ ప్లాంటేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ రక్తం అవసరం ఉంటుందని పేర్కొన్నారు. 

అటువంటి వారికి అవసరమైన రక్తం అందించదానికి బీజేపీ యువమోర్చా కార్యకర్తలు సిద్దంగా ఉండాలని కోరారు. రక్తం కావాల్సిన ప్రజలు, అధికారులు స్థానిక బీజేపీ కార్యకర్తలను సంప్రదించాలని సంజయ్ కుమార్ సూచించారు. 

కాగా,  దేశ రాజ్యాంగ నిర్మాత డా బీఆర్ అంబెద్కర్ రేపు 129వ జయంతి ( 14 ఏప్రిల్, 1891 ) సందర్భంగా ప్రతి బీజేపీ కార్యకర్త ఎవరికి వారు ఇంట్లో పుష్పాంజలి ఘటించాలని పిలుపునిచ్చారు. 

దేశంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానుబావుడి జయంతి సందర్భంగా సామాజిక దూరం పాటిస్తూ బస్తీల్లో పేదలకు నిత్యావసర, అత్యవసర వస్తువులు అందించాలని, ప్రతి ఒక్కరు సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రతి ఒక్కరు అంబెద్కర్ గారి జీవిత చరిత్ర, రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకొని వారి ఆశయ సాధనకు పాటుపడాలని తెలిపారు.