నెల రోజుల పసిబిడ్డతో విధులలో ఐఎఎస్ 

దేశ వ్యాప్తంగా కరోనా మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. లాక్‌డౌన్ కారణంగా పేదలు, అన్నార్తులు జీవితాల్లో చీకట్లు ముసురుసుకున్న తరుణంలో.. ఓ మహిళా ఐఏఎస్ అధికారి నెల రోజుల వయస్సు గల బిడ్డతో విధులకు హాజరవుతూ ఈ మహమ్మారి నుండి ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. 

ప్రజల పట్ల, విధి నిర్వహణ పట్ల ఆమె అంకితభావం చూసి మొత్తం దేశం ఆమెను "కరోనా యుద్ధ నారి" అంటూ వేనోళ్లతో కొనియాడుతున్నది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజన గుమ్మళ్ల మగబిడ్డకు జన్మ ఇచ్చిన మూడు వారాలకే విధులకు హాజరు కావడం ప్రారంభించారు. 

బిడ్డకు జన్మ ఇచ్చిన రోజు ఉదయం కూడా తన కార్యాలయంలో విధులకు హాజరవుతూనే ఉన్నారు. నెలరోజులు కూడా నిండని తన బిడ్డతో కలిసి విధులు నిర్వహిస్తున్న ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా మహమ్మారితో యావత్ దేశం పోరాడుతున్న నేపథ్యంలో...  ప్రజలకు తనవంతు సేవ చేయాలన్న తపనే తనలో ఇలా స్ఫూర్తి నింపిందని ఆమె చెబుతున్నారు. 

‘‘నేను ఉదయం ఆఫీసుకు వెళ్లాను. అదే రోజు సాయంత్రం నాకు బాబు పుట్టాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం అలా పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నేను మళ్లీ విధుల్లో చేరతానంటూ ముఖ్యమంత్రి గారిని అడిగితే... మీకు ఎలాంటి ఇబ్బందీ లేదు కదా అని అడిగారు. నన్ను విధుల్లోకి అనుమతించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు..’’ అని సృజన పేర్కొన్నారు.  

వాస్తవానికి ఆరు నెలల పాటు మాతృత్వ సెలవు తీసుకొనే అవకాశం ఉంది. అయితే  ‘నేను తప్పకుండా పనిచేయాల్సిన సమయం ఇది. ఒక మనిషిగా ప్రభుత్వానికి నావంతు సహకారం అందించడం నా బాధ్యత. మనందరం కలిసికట్టుగా నిలబడి పరస్పరం బలపర్చుకోవాల్సిన సమయం ఇది..’’ అని ఆమె స్పష్టం చేశారు. 

ఆమె 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చెబుతున్నారు. తన బిడ్డను సురక్షితమైన వాతావరణంలో ఉంచుతూ అప్పడప్పుడు ఇంటికెళ్లి పాలిస్తూ, ఆమె ఆలనాపాలన పట్ల జాగ్రత్త వహిస్తున్నారు.  

ఆమె కర్తవ్య దీక్షను చూసి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముగ్ధులయ్యారు. ‘‘ఇలాంటి కరోనా యోధులు ఉండడం మన దేశానికి అదృష్టం. విధి నిర్వహణపై చిత్తశుద్ధికి అచ్చమైన నిదర్శనంగా నిలిచిన ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు...’’ అంటూ కేంద్రమంత్రి ట్వీట్ చేశారు. ఈ పోస్టుతో పాటు సృజన గుమ్మళ్ల తన బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహిస్తున్న ఓ ఫోటో షేర్ చేసుకున్నారు.  

దేశం పట్ల ఆమె అంకితభావాన్ని కొనియాడుతూ అటుంవటి అధికారులు ఉండటం ఈ జాతి అదృష్టం అని బిజెపి ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ఒక ట్వీట్ చేశారు.