కరొనతో సంబంధం లేకనే ఏపీలో స్థానిక ఎన్నికలు!

ఒక వంక రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు రోజు రోజుకు పెరుగుతూ ఉండటం, మరోవంక లాక్ డౌన్ అమలులో ఉన్నా సంబంధం లేకుండా మధ్యలో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను జరిపించడమే ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందున్న తక్షణ కర్తవ్యంగా స్పష్టం అవుతున్నది. 

నాటకీయ పరిణామాల మధ్య అర్ధాంతరంగా ఆర్డినెన్సు ద్వారా  పదవీకాలం కుదించడం ద్వారా ఎన్ రమేష్ కుమార్ ను పదవి నుండి తొలగించి,  రహస్య జిఓ  ద్వారా కొత్తగా ఏరి కోరి ఆ స్థానంలో నియమించుకున్న జస్టిస్ కానగరాజ్ ఆ మేరకు నేడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 

తొలిసారి కమీషన్ లోని అధికారులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.  కరోనా ప్రభావం కారణంగా అసాధారణ పరిస్థితి నెలకొందని చెబుతూనే సమాయనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని పేర్కొంటూ ఈ ఉపద్రవంతో సంబంధం లేకుండా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సంకేతం ఇచ్చారు. 

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో పంచాయతీ రాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతూ చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ కావాలని, అందుకోసం స్థానిక  సంస్థల ఏర్పాటు ఇందులో చాలా కీలకమని కనగరాజ్ పేర్కొన్నారు. తద్వారా ఎన్నికలను మరింకా వాయిదా వేయడం తగదని సహితం కూడా పరోక్షంగా సూచించారు. 

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వం సమాయత్తంగా ఉండాలని సూచించారు.  స్థానిక ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అతికీలకమని కూడా కనగరాజ్ పేర్కొన్నారు.